భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ రఘునాథపాలెం, అక్టోబర్ 24 : ఒకరోజు కాదు.. రెండ్రోజులు కాదు ఏకంగా గడిచిన మూడు నెలలుగా విడవని వానలతో రైతన్నలు కుదేలు అవుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పంటలను పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. పత్తి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపాయి. గత వారంరోజులుగా వర్షం దంచికొట్టడంతో తెల్ల బంగారం పూర్తిగా నల్లబారిపోయింది. వరి పంట ఈనే దశలో తడిసిపోవడంతో నేలకొరిగింది. వడ్లు రంగుమారే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కూరగాయల పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా రెక్కల కష్టం మొత్తం నీటిపాలు కావడంతో అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు.
ఉమ్మడి ఖమ్మంజిల్లాలో కురుస్తున్న వర్షాలు రైతన్నలను ఆగమాగం చేస్తున్నాయి. చేతికొచ్చిన పంటలను ఎందుకూ పనికిరాకుండా చేస్తున్నాయి. ఇప్పటికే కురిసిన అధిక వర్షాలకు పత్తి పంట పనికిరాకుండా పోయింది. తెగుళ్ల కారణంగా మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. గత ఏడాది అనుకున్న స్థాయిలో వర్షాలు కురవక నష్టపోగా.. ఈ ఏడాది మాత్రం అధిక వర్షాలతో రైతుకు సాగు కలిసిరాలేదు. ప్రస్తుతం సాగు చేసిన ఏ పంట కూడా సరిగ్గా చేతికందక దిగాలు చెందుతున్నారు. దీనికితోడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేస్తుండటంతో మరింత భారంగా మారింది. ఇటీవల వచ్చిన వరదలకు భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో పంటలు నష్టపోయినా రైతులకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. జిల్లాలో వానకాలం సీజన్లో అత్యధికంగా పత్తి, మిర్చి, వరి పంటలను సాగు చేశారు.
పంట చేతికొచ్చి చేసిన అప్పులు తీరుతాయని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. ప్రస్తుతం కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా చేతికొచ్చిన పంటలు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అధికవర్షాల కారణంగా తెగుళ్ల బారిన పడింది. మొక్కలు ఎదగకపోవడంతో పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరైంది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిముద్దవుతోంది. గత రెండురోజులుగా దుమ్ముగూడెం, ఇల్లెందు, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, అశ్వారావుపేట, దమ్మపేట, చుంచుపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి మండలాలతోపాటు ఖమ్మంజిల్లాలో పలుచోట్ల మోస్తరు వానలతోపాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. మరో రెండ్రోజులపాటు తుపాన్ ఉందని వాతావారణ శాఖ ప్రకటించటంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు.