మధిర, ఆగస్టు 21 : పత్తి పైరులో గులాబీ రంగు పురుగు నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మధిర వ్యవసాయ సహాయ సంచాలకుడు స్వర్ణ విజయ్ చంద్ర అన్నారు. గురువారం చింతకాని రైతు వేదికలో పత్తి రైతులకు గులాబీ రంగు పురుగుపై నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్తిలో గులాబీ రంగు పురుగు వచ్చే అవకాశం ఉందని, రైతులు విత్తిన 45 రోజుల నుండి గులాబీ రంగు పురుగు ఉనికిని గమనించాలన్నారు. వీటి నివారణకు లింగాకర్షణ బుట్టలు అమర్చాలని, బుట్టలతో ఎనిమిది తల్లి రెక్క పురుగులు పడటం గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. గడ్డి పూలు ఎప్పటికప్పుడు ఏరి నాశనం చేసి మందులు ఉదయం 10 గంటలలోపు పిచికారి చేయాలన్నారు.
కేవీకే ఇన్చార్జి కో ఆర్డినేటర్ టి.పావని మాట్లాడుతూ.. పత్తి పంట జనవరి తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ చేనులో ఉంచకూడదన్నారు. పంటకు నీరు, ఎరువులు పెట్టి పంట కాలాన్ని పొడిగించకూడదన్నారు. పత్తిలో నాణ్యతను పెంచుకోవడానికి ఈ లింగాకర్షణ బుట్టలు విరివిగా రైతులు వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో చింతకాని మండల ఏఓ సోములపల్లి మానస, ఏఈఓలు ఎం.తేజ, ఎస్కే.అయేషా, ఎండీ.తహియ, బి.రాము, డి.కల్యాణి, బి.కార్తీక్, చింతకాని రైతులు పాల్గొన్నారు.