ఖమ్మం, జూలై 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతు రుణమాఫీ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి విడతలో భాగంగా రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లో సంబంధిత నగదును ప్రభుత్వం జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు. 2018 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ 9లోపు రూ.2 లక్షల్లోపు పంట రుణాలు తీసుకున్న రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం..
ఆ మేరకు గురువారం రూ.లక్షలోపు రుణాలున్న రైతుల ఖాతాల్లో సంబంధిత నగదును జమ చేసే ప్రక్రియను చేపట్టింది. అయితే, రూ.50 వేల నుంచి రూ.5 లక్షల్లోపు పంట రుణాలు తీసుకున్న రైతులు ఖమ్మం జిల్లాలో 3,73,157 మంది ఉన్నారు. వీరు రూ.4307.58 కోట్లను రుణంగా పొందారు. భద్రాద్రి జిల్లాలో 1,86,034 మంది రైతులు రూ 1,816.35 కోట్ల పంట రుణాలు తీసుకున్నారు. అయితే, వీరిలో ‘రూ.2 లక్షల్లోపు పంట రుణాలు తీసుకున్న రైతులు ఎంతమంది ఉంటారు? వారు ఎవరు?’ అనే జాబితాను జిల్లా లీడ్ బ్యాంక్ అధికారులు ప్రకటించాల్సి ఉంది.
ఖమ్మం జిల్లాలో రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకున్న రైతుల్లో 59,172 మందికి తొలి విడతలో గురువారం రుణమాఫీ అయింది. వీరి ఖాతాల్లో రూ.264.23 కోట్లు జమ అయ్యాయి. వీరిలో రూ.30 వేల నుంచి మొదలుకొని రూ.90 వేల వరకు పంట రుణాలు తీసుకున్న రైతులు ఉన్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 130 రైతువేదికలకు గాను మండలానికి ఒక రైతువేదికను అధికారులు ఎంపిక చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించే కార్యక్రమాన్ని జిల్లాలోని 21 రైతువేదికల్లో వీడియోకాన్ఫరెన్స్‌ల ద్వారా రైతులు వీక్షించారు.
అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయా రైతువేదికల్లో రైతులతో సంబురాలు నిర్వహించారు. ఇదిలా ఉండగా, అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో అనేకమంది రైతులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కాగా, ఆయా నియోజకవర్గాల్లో జరిగిన సంబురాల్లో ఎంపీ రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, మాలోత్ రాందాసునాయక్తోపాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కలెక్టర్, అదనపు కలెక్టర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ జాబితాలో తమ పేర్లు లేవంటూ, అర్హుల ఎంపికలో తప్పులు జరిగాయంటూ చాలాచోట్ల రైతులు ఆరోపించారు. ప్రభుత్వం పెట్టిన అనేక కొర్రీలతో తాము రుణమాఫీ కోల్పోయామంటూ రైతువేదికల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి క్రాప్‌లోన్ తీసుకున్న తమ పేర్లు, పట్టాబుక్ ద్వారా పంట రుణాలు తీసుకున్న తమ పేర్లు రుణమాఫీ జాబితాలో లేవని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఇప్పుడు కొందరికే రుణమాఫీ చేస్తోందని చాలామంది రైతులు వాపోయారు. తక్షణమే రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.