మధిర, జనవరి 03 : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సీపీఎం కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం అలాగే రాష్ట్ర నాయకుడు సామినేని రామారావు హత్య కేసు నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడాన్ని నిరసిస్తూ మధిర పట్టణంలో సీపీఎం పార్టీ శనివారం భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. నిరసన ప్రదర్శన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా క్యాంప్ కార్యాలయ పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కార్యాలయం వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించడమే కాకుండా, పట్టణంలోని ముఖ్యమైన కూడళ్లలో తనిఖీలను ముమ్మరం చేశారు. ముఖ్యమైన రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను పోలీసులు నియంత్రిస్తున్నారు. ప్రదర్శన శాంతియుతంగా సాగేలా చర్యలు తీసుకుంటున్నామని, ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు.