కొత్తగూడెం ఎడ్యుకేషన్, అక్టోబర్ 28 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకేంద్రమైన కొత్తగూడెం పట్టణంలోని జిల్లా ప్రభుత్వ పెద్దాసుపత్రి, రామవరంలో ఉన్న మాతాశిశు ఆసుపత్రిలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు.జిల్లా జనరల్ ఆసుపత్రి ఎదుట సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యర్యంలో సోమవారం నిరసన దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఏజే రమేశ్ మాట్లాడుతూ జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకునే నాధుడే కరువయ్యాడని, అభివృద్ధి శూన్యంగా మారిందని అన్నారు. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం పడకేసిందన్నారు.
ఆసుపత్రుల్లో రోగులకు సరైన వైద్యం అందడంలేదని, మందుల కొరత తీవ్రంగా ఉందని, సిబ్బంది కొరత, ల్యాబ్, ఎక్స్రే మిషన్, స్కానింగ్ తదితర పరికరాలు పనిచేయకపోవడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు నానా ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాతాశిశు ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో ఆసుపత్రికి వచ్చే గర్భిణులను ప్రసవం కోసం ఖమ్మం, వరంగల్ ఆసుపత్రులకు బలవంతంగా పంపిస్తున్నారని అన్నారు.
ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ రాధామోహన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీఇవ్వడంతో దీక్ష విరమించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు లిక్కి బాలరాజు, భూక్యా రమేశ్, వీరన్న, రమేశ్, పద్మ, రాంచరణ్, రఘు పాల్గొన్నారు.