మధిర, ఏప్రిల్ 3 : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మధిర తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు మాట్లాడుతూ అబద్ధ్దాలతో అందలమెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అన్ని విధాల మోసం చేసిందని ఆరోపించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కాక, రైతు భరోసా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నిరుపేదలకు ఇళ్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ రాచబండి రాంబాబుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు శీలం నరసింహారావు, పార్టీ మండల, పట్టణ కార్యదర్శులు మందా సైదులు, పడకంటి మురళి, పాపినేని రామనర్సయ్య, మందడపు ఉపేంద్ర, ఓట్ల శంకర్రావు, వడ్రాణపు మధు, గౌర్రాజు ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.