రఘునాథపాలెం, ఆగస్టు 1 : ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ పార్టీ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. తొలుత కాల్వొడ్డు నుంచి పీఎస్ఆర్ రోడ్డు మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఆవుల అశోక్ మాట్లాడుతూ హామీల్లో భాగంగా ఆరు గ్యారెంటీలను సీఎం రేవంత్‌రెడ్డి కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని, అధికారం చేపట్టి ఏడు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం వాటి ఊసెత్తడం లేదని మండిపడ్డారు.
ఖమ్మం నగరంలో గత కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు వందలాదిగా ఖాళీగా ఉన్నాయని, రాజీవ్ గృహకల్ప పథకంలో నిర్మించిన 700 ఫ్ల్లాట్లు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే పేదల ప్రజలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఈ నెల 8న పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో కలెక్టరేట్ ఎదుట ధర్నా, ఈ నెల 21న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ డివిజన్ కార్యదర్శి ఝాన్సీ శిరోమణి, శోభ, సురేశ్, జాస్మిన్, శారధ, లెనిన్, లక్ష్మీనారాయణ, వెంకటేశ్, కేశవులు, అంజలి, పద్మ, మౌనిక, రామారావు, అనంత తదితరులు పాల్గొన్నారు.