దమ్మపేట, జూన్ 1: స్థానిక సమస్యల పరిష్కారం కోసం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇంటిని సీపీఐ నేతలు ఆదివారం ముట్టడించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని, విద్యుత్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలంలోని ఎమ్మెల్యే స్వగ్రామమైన గండుగులపల్లిలోని జారే ఇంటిని సీపీఐ నాయకులు, నిరుపేదలు ముట్టడించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఐ మండల ప్రధాన కార్యదర్శి సుంకిపాక ధర్మ మాట్లాడుతూ.. మండల కేంద్రానికి సమీపంలోని మల్లారం గ్రామ శివారులో సుమారు 120 కుటుంబాలకు చెందిన నిరుపేదలు ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నారని అన్నారు.
ఎమ్మెల్యేగా గెలిచిన జారే.. ఆ నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తారని, విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తారని ఆశించామని అన్నారు. ఏడాదిన్నర దాటినా తమ సమస్యలు పరిష్కరించకపోవడంతో తాము ఇప్పటికీ అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే జారే.. ఆందోళనకారులను లోపలికి పిలిచి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. దీంతో ఎమ్మెల్యేకు నాయకులు, నిరుపేదలు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పందిస్తూ.. రెండు మూడు రోజుల్లో అధికారులను విచారణకు పంపిస్తామని అన్నారు. సీపీఐ నాయకులు, నిరుపేదలు పాల్గొన్నారు.