మామిళ్లగూడెం, జనవరి 17: బ్యాంకుల వద్ద రాత్రిపూట పెట్రోలింగ్ ముమ్మరం చేయనున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. బ్యాంకుల భద్రత, ఏటీఎంలలో నగదు రవాణా సమయంలో తీసుకుంటున్న భద్రతా చర్యలపై నగరంలోని బ్యాంకు అధికారులతో సీపీ శుక్రవారం సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకుల్లో ఏవైనా భారీ లావాదేవీలు జరిగినప్పుడు సంబంధిత శాఖకు చెందిన బ్యాంకు మేనేజర్ అభ్యర్థన మేరకు ఆరోజు పోలీస్ పెట్రోలింగ్ బ్యాంకుల వద్ద ఉండేలా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశామన్నారు.
బ్యాంకుకు ఏదైనా ముప్పు లేదా పోలీసుల నుంచి సహాయం కావాలని సంబంధిత మేనేజర్ అభ్యర్థించినప్పుడు ఆలస్యం లేకుండా స్థానిక పోలీసులు సహాయం అందిస్తారని తెలిపారు. ముఖ్యంగా భద్రతా ప్రయోజనాల కోసం బ్యాంకు పేరుతో తుపాకి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని బ్యాంకు మేనేజర్లకు సూచించారు. బ్యాంకు సమీప ఇళ్లు, పరిసరాల్లో ఎవరు నివసిస్తున్నారో సెక్యూరిటీ చెక్ చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.