కొత్తగూడెం క్రైం, నవంబర్ 23 : గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నిందితులకు శిక్షపడేలా కృషి చేసిన జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందికి డీజీపీ జితేందర్ హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో శనివారం రివార్డులను అందజేశారు. భద్రాచలం పోలీస్‌స్టేషన్ పరిధిలోని అధికారులు, సిబ్బందిని డీజీపీ ప్రశంసించారు. రివార్డులు అందుకున్న అధికారులను జిల్లా ఎస్పీ బిరుదరాజు రోహిత్‌రాజు అభినందిస్తూ శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.
2023 సంవత్సరంలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేవిధంగా కృషి చేసిన అప్పటి భద్రాచలం ఇన్స్పెక్టర్ నాగరాజురెడ్డి, ఎస్సై శ్రీకాంత్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ సుధీర్ల కృషిని ఎస్పీ ప్రశంసించారు. భద్రాచలం పోలీస్‌స్టేషన్‌లో 480కిలోల గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడిన ఇద్దరికి 10ఏండ్ల కఠిన కారాగార శిక్షతోపాటు ఒక్కొక్కరికీ రూ.లక్ష జరిమానా పడే విధంగా కోర్టుకి సాక్ష్యాధారాలను సమర్పించి సమర్ధవంతంగా పని చేసినందుకు రివార్డులను అందించినట్లు ఎస్పీ తెలిపారు. కేసులో కీలకంగా వ్యవహరించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజయ్‌కుమార్‌ని సైతం ఎస్పీ అభినందించారు.