ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి యార్డు సందర్శనకు వచ్చిన సీసీఐ అధికారులపై పత్తి రైతులు సోమవారం తిరగబడ్డారు. ఖమ్మం ఏఎంసీలో సీసీఐ కేంద్రం ఏర్పాటు చేయడం లేదని, అనేక కొర్రీలు పెట్టి తమను నిలువు దోపీడీ చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ వారిని ఘెరావ్ చేశారు. సీసీఐ మేనేజర్ అర్జున్, అసిస్టెంట్ మేనేజర్ అవినాశ్ కలిసి సోమవారం ఖమ్మం ఏఎంసీ పత్తి యార్డులో పత్తి క్రయవిక్రయాల సందర్శనకు వచ్చారు. వీరిని చూసి ఆగ్రహానికి గురైన రైతులు వెంటనే వారిని చుట్టుముట్టి నిరసన తెలిపారు. ఇక్కడి ఖరీదుదారులు సవాలక్ష కొర్రీలతో తమను అరిగోస పెడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ఏఎంసీలో సీసీఐ కేంద్రం ఏర్పాటు చేయకుండా పరోక్షంగా ప్రైవేట్ వ్యాపారులకు సహకరిస్తున్నారంటూ ఘోరావ్ చేశారు. ఏముఖం పెట్టుకొని మార్కెట్ యార్డులో తిరుగుతున్నారని రైతులు తిరగబడ్డారు. తేమ శాతం 12లోపు ఉన్నదీ లేనిదీ తమకు తెలియకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు ఎంత తక్కువ ధర చెప్పినా అంతే అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఐ అధికారుల వైఖరి కారణంగానే తాము మద్దతు ధర పొందలేక పోతున్నామని మండిపడ్డారు. దీంతో అక్కడికి వచ్చిన జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎంఏ అలీం, మార్కెట్ కమిటీ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్‌లు రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. అయితే, ఖమ్మం ఏఎంసీలో సీసీఐ కేంద్రం ఏర్పాటు విషయంలో మాత్రం సీసీఐ అధికారులు స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.
తిరుమలాయపాలెం మండలం గోల్‌తండాలోని భాగ్యలక్ష్మీ కాటన్ మిల్లు వద్ద కూడా రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. తేమ శాతం పేరుతో రైతుల పత్తి పంటను కొనుగోలు చేయని సీసీఐ అధికారులు.. ప్రైవేటు వ్యాపారులు బొలేరో వాహనాల్లో తెచ్చిన పత్తిని మద్దతు ధరకు కొనడంతో రైతులు ఆగ్రహించారు. మిల్లు గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు.
తమ పత్తిని కొనేందుకు సాకులు చెప్పి వ్యాపారుల పత్తిని ఎలా కొనుగోలు చేస్తున్నారంటూ నిలదీశారు. అయితే, వారు వ్యాపారులని తమకు తెలియదని, వారు కూడా రైతులే అనుకున్నామని అధికారులు సమాధానం చెప్పడం గమనార్హం. అయితే, మంత్రి పొంగులేటి ఇటీవల ఈ మిల్లును సందర్శించి సీసీఐ కొనుగోళ్లను పరిశీలించారు. మద్దతు ధర ఇవ్వాల్సిందేనని ఆదేశించారు. కానీ ఆచరణలో ఆయన ఆదేశాలు కూడా బేఖాతరు కావడం గమనార్హం.