ఖమ్మం వ్యవసాయం, జూలై 14: బంగాళాఖాతంలో చాలా రోజుల తరువాత అల్పపీడనం ఏర్పడడం, ఆ ప్రభావం జిల్లాపై కనపడుతుండడంతో జిల్లా రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గత వానకాలం సీజన్లో వరుణుడు ముఖం చాటేయడంతో అన్నదాతలు తీవ్రంగా ఆందోళన చెందారు. సరైన వర్షాలు లేకపోవడంతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటాయి. దీనికితోడు సాగర్ కాలువ ద్వారా సైతం నీరు విడుదల కాకపోవడంతో యాసంగి సాగు ప్రశ్నార్థకమైన విషయం విదితమే. చివరికి ఆయకట్టు ప్రాంతం పూర్తిగా ఎడారిగా మారిన సంగతి తెలిసిందే. దాదాపు దశాబ్దకాలం తర్వాత గత సంవత్సరం అత్యల్పంగా సాగుకావడం గమనార్హం.
గత ఏడాది నీటి వనరులు పూర్తిగా ఎండిపోవడంతో ఈ సంవత్సరం జలశయాలు నిండడం కష్టతరంగా మారింది. అయితే గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం వర్షపాతం చాలా మెరుగ్గా ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే ఆశాభావంలో రైతులు ఉన్నారు. ఇప్పటికే మెట్ట పంటల సాగు పూర్తి చేసిన రైతులు.. వర్షపాతాన్ని బట్టి వరి పొలాలను దమ్ము చేసే ఆలోచనలో ఉన్నారు. అల్పపీడనం ప్రభావంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తోడు రాబోయే నాలుగు రోజులు సైతం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆశాజనకంగా
గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సర వర్షపాతం ఆశాజనకంగా ఉంది. గడచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 28.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చింతకాని మండలంలో 47.2 మి.మీ నమోదైంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి జూలై 12వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 305.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా సాధారణ వర్షపాతం 213 మి.మీ కాగా 43 మి.మీ అధికంగానే నమోదైంది. గత ఏడాది జూన్ 1 నుంచి జూలై 12వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా సగటు వర్షపాతం కేవలం 108.8 మి.మీ మాత్రమే నమోదైంది. కామేపల్లి, ఏన్కూరు మండలాల్లో ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం నమోదు కాగా, ఎర్రుపాలెం, సింగరేణి మండలాల్లో సాధారణం కంటే తక్కువ నమోదైంది. మిగిలిన మండలాల్లో సాధారణంకంటే ఎక్కువగానే నమోదైంది.
ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడం, అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గత సంవత్సరం రెండు సీజన్లలో సైతం జిల్లాలోని సాగర్ ఎడమ కాలువ పరివాహక ప్రాంతం పూర్తిగా బీడుభూములుగా తయారైంది. జిల్లాలో మొత్తం 21 మండలాలకు 16 మండలాలు సాగర్ కాలువ పరీవాహక ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ మండలాల పరిధిలో సుమారుగా ఆయకట్టు సాగు ప్రతి ఏటా 2 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుండగా మరో 50వేల ఎకరాల్లో మెట్ట పంటల సాగు జరుగుతున్నది.
ఈ సంవత్సరం నేటివరకు వరి పంట సాగుకు సంబంధించి సత్తుపల్లి మండలంలోనే 12 వేల ఎకరాల్లో వరినాట్లు ప్రక్రియ పూర్తి అయ్యింది. మిగిలిన మండలాల్లో రైతులు నారుమడులు పోసి భారీ వర్షాలు, సాగర్ కాలువ నీటి కోసం వేచి చూస్తున్నారు. పత్తి సాగు 21 మండలాల్లో కలిసి 1.82 లక్షల ఎకరాల్లో సాగు కాగా, పెసర సాగు చింతకాని, కొణిజర్ల మండలాల్లో అత్యధికంగా 10 వేల ఎకరాల్లో సాగు జరిగింది. వ్యవసాయశాఖ సాగు లక్ష్యం నెరవేరాలంటే వరి సాగు మరో 2 లక్షల ఎకరాలు, మిర్చి సాగు 80 వేల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉంది.