బోనకల్లు, మార్చి 19 : ప్రశాంత వాతావరణంలో పరీక్షలు సజావుగా సాగేలా అంతా సహకరించాలని ఖమ్మం జిల్లా బోనకల్లు మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య కోరారు. బుధవారం మండల విద్యా వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 28 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో ఎక్కడ సమస్య ఉనా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చూడాలన్నారు.
బోనకల్లు మండలంలో బోనకల్లు ఉన్నత పాఠశాల, రావినూతల ఉన్నత పాఠశాల, జానకిపురం ఉన్నత పాఠశాల మూడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కేంద్రాల్లో 396 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా మండలంలోని మోటమర్రి, కలకోట, బ్రాహ్మణపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు మధిర మండలంలోని సిరిపురం ఉన్నత పాఠశాలలో 44 మంది, ముష్టికుంట్ల ఉన్నత పాఠశాలలో 32 మంది విద్యార్థులు చింతకాని మండలంలోని నాగలవంచా ఉన్నత పాఠశాలలో పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 9 : 30 నుండి మధ్యాహ్నం 12 : 30 గంటల వరకు పరీక్షల నిర్వహణ జరుగుతుందన్నారు. విద్యార్థులు ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.