ఎర్రుపాలెం, జూన్ 12 : ప్రజల కష్టాలు తీర్చాల్సిన బ్రిడ్జి అధికారుల అలసత్వంతో ఇప్పుడు వారి ఇబ్బందులకు కారణంగా మారింది. దీర్ఘ కాలంగా నిలిచిపోయిన నిర్మాణ పనులు, స్పందించని అధికారులు, పట్టించుకోని కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో రేమిడిచర్ల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం మొదలవడంతో ప్రమాదాల భయం మరింత పెరగడంతో గ్రామ సర్పంచ్ స్వయంగా రంగంలోకి దిగి రోడ్డును మూసివేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని రేమిడిచర్ల గ్రామం వద్ద ఎర్రుపాలెం–జి.కొండూరు ఆర్అండ్బి రహదారిపై రేమిడిచర్ల, కొత్తపాలెం వద్ద రెండు బ్రిడ్జిల నిర్మాణాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆమోదం తెలిపింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చొరవతో మంజూరైన ఈ పనులు గ్రామ ప్రజల్లో ఆశలు రేకెత్తించాయి. అయితే టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు ప్రారంభించినప్పటికీ నత్తనడకన కొనసాగించి, చివరకు అసంపూర్తిగా వదిలేయడంతో ప్రజల ఆశలు అడియాశలయ్యాయి.
బ్రిడ్జి నిర్మాణం పూర్తికాక పోవడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డుపైనే ప్రజలు నిత్యం ప్రయాణిస్తున్నారు. కానీ వర్షం పడిన ప్రతిసారి ఆ మార్గం బురదకూపంగా మారి ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. అనేకమార్లు ద్విచక్ర వాహనదారులు జారిపడి ప్రమాదాల బారిన పడ్డారు. వృద్ధులు, మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడడం తరచూ జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో, ప్రజల ప్రాణాల భద్రతను దృష్టిలో పెట్టుకుని రేమిడిచర్ల గ్రామ సర్పంచ్ కాపు వరప్రసాద్ శుక్రవారం కఠిన నిర్ణయం తీసుకున్నారు. గ్రామ సమీపంలోని బ్రిడ్జి వద్ద ప్రమాదకరంగా మారిన డైవర్షన్ రోడ్డుకు అడ్డంగా ట్రెంచ్ తవ్వించి వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
దీంతో మండల కేంద్రానికి వెళ్లాల్సిన ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో సుదూర ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. రైతులు తమ వ్యవసాయ అవసరాల కోసం, విద్యార్థులు చదువుల కోసం, ఉద్యోగులు విధులకు వెళ్లేందుకు అదనపు సమయం, ఖర్చు భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రమాదం జరిగాక స్పందిస్తారా లేక ముందే సమస్యను పరిష్కరిస్తారా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జోక్యం చేసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు నిలిచిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.