– ఉపాధి లేక కార్మికుల కుటుంబాల అవస్థలు
– సమస్య తీవ్రత తెలిపేందుకే చలో హైదరాబాద్
– రాష్ట్ర వ్యాప్తంగా రూ.20 వేల కోట్ల పెండింగ్ బకాయిలు
– విలేకరుల సమావేశంలో బీఏఐ రాష్ట్ర నేతలు, కాంట్రాక్టర్లు వెల్లడి
ఖమ్మం రూరల్, జూన్ 05 : రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది గుత్తేదారులకు వేలకోట్ల బిల్లులు పెండింగ్లో ఉండడం ద్వారా ఇప్పటికే అనేకమంది కాంట్రాక్టర్లు, బిల్డర్స్ అసోసియేషన్ నాయకుల గుండెలు ఆగిపోయాయని సత్వర పరిష్కారం కోసమే చలో హైదరాబాద్కు పిలుపునివ్వడం జరిగిందని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నాయకులు, కాంట్రాక్టర్లు తెలిపారు. శుక్రవారం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బి ఏ ఐ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ డివిఎన్ రెడ్డి రాష్ట్ర చైర్మన్ శ్రీనివాసరావు, సెక్రెటరీ పవన్ కోశాధికారి సంతోష్ రెడ్డి, కిసాన్ శ్రీనివాసరావు, ఖమ్మం జిల్లా సెంటర్ చైర్మన్ కిశోర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంట్రాక్టర్లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత కొద్ది సంవత్సరాలుగా వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కాంట్రాక్టర్లు బిల్లులు రాక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిమంది గుత్తేదారులకు మాత్రమే బిల్లులు అందుతున్నాయని, ఆది నుండి నిర్మాణ పనులు చేసిన వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.
దీంతో గతంలో వందల కోట్లు కలిగిన కాంట్రాక్టర్లు నేడు రూ.10, 20 కోట్ల టర్నోవర్కే పరిమితమవుతున్నారన్నారు. తద్వారా వారిని నమ్ముకున్న అనేకమంది స్కిల్డ్, నాన్ స్కిల్డ్ కార్మికులు, వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం ద్వారా ఇప్పటికే అనేకమంది గుండెపోటుతో మరణించగా, మరికొంతమంది ఆత్మహత్యలకు సైతం పాల్పడడం జరిగిందన్నారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, చేసిన పనులకు ఫస్ట్ క్లారిటీ చొప్పున పెండింగ్ బిల్లుల చెల్లింపు విధానం అమలు చేయాలన్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఇష్టారీతిన బిల్లుల చెల్లింపు చేస్తున్నారని, ఈ విషయాన్ని తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రభుత్వం నుండి సమాచారం రావడం లేదన్నారు. చెల్లింపు విధానాలను వెబ్సైట్ ద్వారా చూడకుండా సదర్ సైట్లను సైతం క్లోజ్ చేయడం బాధాకరమన్నారు. నేటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు సుమారు రూ.20 వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్టర్లు బిల్లుల కోసం బిక్షగాండ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు.
విధిలేని పరిస్థితిలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బిల్లుల చెల్లింపునకై ఈ నెల 18న చలో హైదరాబాద్కు పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ వైఖరి మార్చుకుని కాంట్రాక్టర్ల ఇబ్బందులను పరిగణలకు తీసుకుని పెండింగ్ బిల్లులను చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి చలో హైదరాబాద్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బిల్డర్స్ అసోసియేషన్, వివిధ శాఖలకు చెందిన గుత్తేదారులు, వారి సిబ్బంది కదిలి రావాలని పిలుపునిచ్చారు. చలో హైదరాబాద్ కార్యక్రమం అనంతరం ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రాని ఎడల దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుత్తేదారులు గరికపాటి వెంకటేశ్వరరావు, రామకృష్ణరెడ్డితో పాటు పలువురు ఉమ్మడి జిల్లాకు చెందిన గుత్తేదారులు పాల్గొన్నారు.