ఖమ్మం సిటీ, డిసెంబర్ 6 : మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఖమ్మం పెద్దాసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు సీఐటీయూ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కాసేపు విధులు బహిష్కరించి ఆసుపత్రి ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల బాధ్యులు తుమ్మ విష్ణువర్ధన్, జీ రామయ్య మాట్లాడుతూ రెక్కాడితే డొక్కాడని కార్మికుల జీవితాలతో ప్రభుత్వం, అధికారులు, కాంట్రాక్టర్ ఆటలాడుకుంటున్నారని ధ్వజమెత్తారు.
నెలల తరబడి వేతనాలు ఇవ్వకుంటే వారి కుటుంబాలు ఎలా గడుస్తాయని ప్రశ్నించారు. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్నా కార్మికుల వేతనాల గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తక్షణమే పెండింగ్‌తో కలిసి మొత్తం వేతన బకాయిలు చెల్లించాలని, లేదంటే మంత్రుల ఇండ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు వై.విక్రం, కే శ్రీనివాస్, విజయమ్మ, వెంకటరమణ, అశోక్, అంబేద్కర్, ఉపేందర్ పాల్గొన్నారు.