ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలు పాస్ అవుతామో లేదోనని గిరిజన ఆశ్రమ పాఠశాలల పదో తరగతి విద్యార్థులు భయపడిపోతున్నారు. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు (కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్) సమ్మెలో ఉన్న విషయం విదితమే. 13 రోజులుగా విద్యాబోధన అటకెక్కింది. మరోవైపు వార్షిక పరీక్షల సమయం దగ్గరపడుతున్నది. సిలబస్ ఇంకా పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులు తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక అయోమయంలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో వెంటనే తరగతులు జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
-ఇల్లెందు, జనవరి 1
భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు గత 13 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం ఐటీడీఏ పరిధిలో 62 పాఠశాలలు ఉండగా.. ఇందులోని 45 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, 17 కన్వర్టెడ్ పాఠశాలల్లో 276 మంది కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ (సీఆర్టీ) పని చేస్తున్నారు. వీరిలో ఉన్నత చదువులు చదివి 20 సంవత్సరాలుగా హయ్యర్ క్లాసులకు కూడా పాఠాలు చెబుతున్నవారు ఉన్నారు. వీరందరూ సమ్మెలో ఉండడంతో ప్రస్తుతానికి 60 శాతం సిలబస్ మాత్రమే పూర్తయింది. టీచర్లు రాకపోవడంతోపాటు పదో తరగతి ఫైనల్ పరీక్షలకు 3 నెలలు కాలం కూడా లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో సీఆర్టీలకు 12 నెలల వేతనం జీవో విడుదల చేశారు.. మూడుసార్లు వేతనాలు పెంచారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ఉపాధ్యాయులను పర్మినెంట్ చేయాలని సీఆర్టీలు సమ్మె నిర్వహిస్తున్నారు.
గంగారం ఆశ్రమ పాఠశాలలో టెన్త్ చదువుతున్నాను. 13 రోజులుగా క్లాసులు జరగడం లేదు. ముఖ్యంగా గణితం, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులు అసలు జరగట్లేదు. పరీక్షలు దగ్గర పడ్డాయి.. ఇంతవరకు సిలబస్ పూర్తికాలేదు. పబ్లిక్ పరీక్షల్లో పాస్ అవుతామో లేదోనని భయంగా ఉంది. దయచేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
-మూతి సుశాంత్, టేకులపల్లి
నేను సింగరేణి (కారేపల్లి) మండలం రేలకాయపల్లి ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. మాకు ప్రతిరోజూ అన్ని సబ్జెక్టుల క్లాసులు జరగడం లేదు. ముఖ్యంగా తెలుగు, గణితం టీచర్లు సమ్మెలో ఉండడం వల్ల మాకు ఆ తరగతులు జరగట్లేదు. వారి సమస్యలు వెంటనే పరిష్కరించి పాఠశాలకు పంపించాలి.
-పిల్లలమర్రి వాసు, కారేపల్లి