రఘునాథపాలెం, జూలై 11 : భవిష్యత్ తరాలు చెప్పుకునే విధంగా ఆదర్శ కళాశాలగా మెడికల్ కాలేజీ భవన నిర్మాణాలు ఉండాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం అర్బన్ పరిధి బాలప్పేట శివారులో బైపాస్ రోడ్డుకు ఆనుకొని 40 ఎకరాల్లో మెడికల్ కళాశాల నిర్మించనున్న స్థలాన్ని కలెక్టర్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల నిర్మాణానికి కేటాయించిన భూమికి సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. భవనాలు, ప్రహరీ నిర్మాణాలు నాణ్యతతో చేపట్టాలని సూచించారు. కాగా.. స్థలం మొత్తాన్ని కలియతిరిగి భవన నిర్మాణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు, ఆర్అండ్బీ ఏఈ హేమలత, ఆర్డీవో గణేశ్, సర్వే ఏడీ శ్రీనివాసులు, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సీహెచ్.స్వామి, రఘునాథపాలెం తహసీల్దార్ లూథర్ విల్సన్ తదితరులు ఉన్నారు.