ఆరు అంతస్తుల భవనం బుధవారం ఒక్కసారిగా కుప్పకూలడంతో భద్రాచలంవాసులు ఉలిక్కిపడ్డారు. శిథిలాల కింద ఎంతమంది కూలీలు మృతిచెందారు? ఎంతమంది క్షతగాత్రులుగా మిగిలారు? అనే అంశంపై స్పష్టత రావడం లేదు. భద్రాచలం పంచాయతీ కార్యాలయానికి కూతవేటు దూరంలో సలీం టీ స్టాల్ పక్కనే షేక్ మౌలానా అలియాస్ శ్రీపతి అనే వ్యక్తి శ్రీపతి నేషనల్ సేవా ట్రస్టు పేరుతో భవన నిర్మాణాన్ని నిబంధనలకు విరుద్ధంగా చేపట్టాడు.
నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలోనే ఒక్కసారిగా పేకమేడలా భవనం కూలిపోయింది. దీంతో నిర్మాణ పనుల్లో నిమగ్నమైన కూలీలు భవనం శిథిలాల్లో చిక్కుకుపోయినట్లు సమాచారం. పోలీసులు, రెస్క్యూ, ఫైర్ సిబ్బంది, అధికార యంత్రాంగం హుటాహుటిన అక్కడికి చేరుకుని శిథిలాలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.
పడిశాల ఉపేందర్‌రావు, చల్లా కామేష్ అనే ఇద్దరు కూలీలు పని చేస్తున్నట్లు వారి కుటుంబ సభ్యులు చెబుతున్నప్పటికీ అసలు ఎంతమంది శిథిలాల్లో చిక్కుకున్నారనే విషయం అధికారికంగా వెల్లడికాలేదు. కాగా, ఆ ఇద్దరి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఉపేందర్‌రావు, కామేష్‌లు రెండు రోజులుగా భవన నిర్మాణ పనులు చేస్తున్నారు. తన భర్త ఉపేందర్రావును కామేష్ అనే వ్యక్తి పని నిమిత్తం బుధవారం తీసుకువచ్చినట్లు ఉపేందర్‌రావు భార్య రమాదేవి రోదిస్తూ తెలిపింది.
మిన్నంటిన రోదనలు
ఆరంతస్తుల భవనం కుప్పకూలడంతో పనులు చేసేందుకు వచ్చిన కూలీల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. భవనం శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారు? అసలు ఉన్నారా? లేదా? అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. శిథిలాల కింద ఇద్దరు ఉన్నట్లు తెలుస్తున్నప్పటికీ అనధికారికంగా ఎంతమంది కూలీలు చిక్కుకున్నారనేది మాత్రం తెలియరాలేదు.
హుటాహుటిన సహాయక చర్యలు
భవనం కుప్పకూలిందన్న సమాచారంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. గంటల వ్యవధిలోనే రెస్క్యూ, పోలీసు, అగ్నిమాపక, సింగరేణి బృందాలు భవనం కుప్పకూలిన ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు, ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, ఆర్డీవో దామోదరరావు, అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాసరావు కూడా దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
పర్యవేక్షణ లోపమా?
ఏజెన్సీ ప్రాంతంలోని భద్రాచలం పట్టణం 1/70 యాక్ట్ పరిధిలో ఉంది. ఇక్కడ బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు ఉండవు. ఒకవేళ ఉన్నా కఠినతరంగా ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో ఆ భవనంలో ఆరు అంతస్తుల నిర్మాణానికి ఎలా అనుమతులొచ్చాయి? ఒకవేళ అనుమతులు లేకుండానే నిర్మాణం చేపడుతున్నారా? అనేది ప్రశ్నార్థకంగా ఉంది. దానికితోడు నిర్మాణంలో నాణ్యతా లోపం కూడా స్పష్టంగా ఉన్నట్లు పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. ఈ భవనం నిర్మాణంపై అభ్యంతరం చెబుతూ గిరిజన సంఘాలు చేసిన ఫిర్యాదులను కూడా అధికారులు పట్టించుకోలేదని స్పష్టమవుతోంది.
శిథిలాల్లో ఆర్తనాదాలు..
ఆక్సిజన్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపించిన రెస్క్యూ సిబ్బంది
‘కాపాడండి..’ అంటూ శిథిలాల్లో నుంచి ఓ వ్యక్తి చేసిన ఆర్తనాదాలు రెస్క్యూ సిబ్బందికి వినిపించాయి. దీంతో వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ‘నా పేరు కామేష్. నన్ను కాపాడండి’ అంటూ అతడు అరిచినట్లు వినిపించింది. దీంతో రెస్క్యూ బృందాలు అతడిని కాపాడేందుకు లైట్ల వెలుతురు మధ్య పైపుల ద్వారా ఆక్సిజన్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపించారు. శిథిలాలు అతడిపై పడకుండా అడుగు భాగంలో జాకీలను ఏర్పాటు చేశారు. అతడితో కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు మాట్లాడి ధైర్యం చెప్పారు.