మామిళ్లగూడెం, మే 31 : సకల సదుపాయాలతో భవిష్యత్ తరాలకు అనుగుణంగా ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణం ఉండాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ ఎన్.వాణితో కలిసి ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య కళాశాల శాశ్వత భవన నిర్మాణానికి అర్బన్ మండలం బల్లెపల్లి, రఘునాథపాలెం గ్రామాల్లో సుమారు 43 ఎకరాల స్థలం గుర్తించామన్నారు. నిర్మాణ ప్లాన్‌లో కళాశాల భవనాలు, విద్యార్థుల హాస్టల్, అధ్యాపకుల క్వార్టర్స్ నిర్మాణం, హైవేకు కళాశాల ప్రధాన భవనం ఫేసింగ్ ఉండి.. విజుబుల్‌గా ఉండేట్లు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు వైద్య విద్య సంచాలకులు డాక్టర్ విమల థామస్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్‌కుమార్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.కిరణ్‌కుమార్, ఆర్అండ్బీ ఎస్ఈ శ్యామ్‌ప్రసాద్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ మదన్‌గోపాల్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సీహెచ్.స్వామి పాల్గొన్నారు.