కారేపల్లి, జనవరి 11: ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో తమ బంధువులతో వారికి ఓట్లు వేయించలేదన్న కారణంతో కాంగ్రెస్ సర్పంచ్, ఆమె భర్త, వారి అనుచరులు, వార్డు సభ్యులు కలిసి తమపై కక్షగట్టారని ఓ బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. తమ కుమార్తె కల్యాణలక్ష్మి దరఖాస్తుపై సంతకం పెట్టేందుకు సర్పంచ్ భర్త ప్రోద్బలంతో సర్పంచ్ నిరాకరిస్తోందని, వారి తమ కుటుంబ సభ్యులు గతంలో పెట్టిన కేసులు వెనక్కు తీసుకోవాలంటూ షరతు పెడుతోందని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. బాధితులు ఆదివారం విలేకరులకు వెల్లడించిన కథనం ప్రకారం..
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలం గేటు రేలకాయలపల్లి గ్రామానికి చెందిన మాలోత్ లక్ష్మి – రవి అనే దంపతులు ఆరు నెలల క్రితం వారి కుమార్తెకు వివాహం జరిపించారు. కల్యాణలక్ష్మి సాయం కోసం ప్రభుత్వానికి అప్పుడే దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో ఉన్న పంచాయతీ ప్రత్యేకాధికారి వీరి దరఖాస్తును పరిశీలించి.. వారి కుమార్తెకు మొదటి వివాహ ధ్రువపత్రంపై సంతకం చేసి తదుపరి విచారణ నిమిత్తం తహసీల్దార్ కార్యాలయానికి పంపారు. ఇన్నాళ్లూ అక్కడ అది పెండింగ్‌లో ఉంది. ఈ మధ్య ఆ దరఖాస్తు విషయమై తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిని బాధితులు లక్ష్మి, రవి సంప్రదించగా.. ‘మీ దరఖాస్తులో మొదటి వివాహ ధ్రువపత్రంలేదు. తాజాగా సర్పంచ్ సంతకంతో మరో ధ్రువపత్రాన్ని తెచ్చి ఇస్తే దరఖాస్తు జతచేస్తాం’ అంటూ సమాధానం చెప్పారు. తాము గతంలోనే ప్రత్యేకాధికారి సంతకం చేసిన ధ్రువపత్రాన్ని దరఖాస్తుకు పొందుపర్చామని బాధితులు చెప్పినా.. ఆ దరఖాస్తుకు ఆ పత్రం లేదంటూ కార్యాలయ సిబ్బంది స్పష్టం చేశారు.
తాజాగా సర్పంచ్‌తో సంతకంతో తెస్తేనే దరఖాస్తును ఆమోదిస్తామని తేల్చిప్పారు. దీంతో ఈ ధ్రువపత్రం కోసం సర్పంచ్ వద్దకు బాధితులు వెళ్లగా.. సర్పంచ్ భర్త ప్రోద్బలంతో సదరు సర్పంచ్ సంతకం చేసి ధ్రువపత్రం ఇచ్చేందుకు నిరాకరించింది. సర్పంచ్ సంతకం కావాలంటూ గతంలో తమపై మీ కుటుంబ సభ్యులు పెట్టిన కేసులను వెనక్కు తీసుకోవాలంటూ సదరు సర్పంచ్ భర్త, వారి అనుచరులు, వార్డు సభ్యులు షరతు పెట్టారు. అంతేగాక, సంతకం పెట్టినందుకు తమకు కొంత నగదు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలపై బాధితులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై. సర్పంచ్ కేలోతు మంగమ్మను ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా.. మాలోత్ లక్ష్మి రవి దంపతులు చెబుతున్నవన్నీ అవాస్తవాలంటూ కొట్టిపారేశారు.