జూలూరుపాడు ఆగస్టు 24 : రైతులకు సరిపడా యూరియా ఇవ్వలేని కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం అని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్పు అనే నినాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతో దొంగ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పాలనలో సరిపడా యూరియా ఎరువులు దొరకక రైతుల పాలిట శాపంగా మారిందని, గత కేసీఆర్ పాలనలో రైతు రాజుగా పేరుగాంచిన తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో రైతులు యూరియా కోసం రోడ్ల మీదకు వచ్చి చెప్పులు లైన్లో పెట్టి అవస్థలు పడుతున్నారని అన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇద్దరు కలిసి తెలంగాణ రైతులను నట్టేట ముంచుతున్నారని, రాష్ట్రంలో ఒక పక్క యూరియా కోసం రైతులు, మరోపక్క ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ కోసం విద్యార్థులు, వేతనాల కోసం ఔట్ సోర్సింగ్ కార్మికులు, రోడ్లెక్కి ధర్నాలు చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం బీహార్ ఎన్నికలని బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అని డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైన ప్రభుత్వం ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టాలని, లేని పక్షంలో రైతులు, విద్యార్థుల చేత పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.