భద్రాచలం, మే 3: పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీలపై నిలదీయాలని పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ ఇన్చార్జిల సమావేశంలోఆయన మాట్లాడారు. అమలుకు సాధ్యంకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీతో నాలుగు నెలలుగా గోస పడుతున్నామని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో మరోసారి మోసపోకుండా ఉందామని అన్నారు.
ఇందుకోసం బీఆర్ఎస్కు ఓటు వేసి మాలోత్ కవితను గెలిపించాలని కోరారు. ఇందుకోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. కేంద్రంలోని బీజేపీని ప్రశ్నించే దమ్మున్న ఏకైక వ్యక్తి కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రజల సౌలభ్యం కోసం కేసీఆర్ ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను ఇప్పటి ప్రభుత్వం రద్దు చేస్తామంటుండడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్‌ను తిట్టడం తప్ప ఈ ప్రభుత్వానికి ఏమీ చేతకావడంలేదని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు మానె రామకృష్ణ, ఆకోజు సునీల్‌కుమార్, పడిశిరి శ్రీనివాస్, రేపాక పూర్ణ, ఉడతా రమేశ్, కోలా రాజు, వీరబోయిన వెంకటనర్సమ్మ, కావూరి సీతామహాలక్ష్మి పాల్గొన్నారు.