బోనకల్లు, మే 2: జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల్లో ఒకరు భూముల సెటిల్మెంట్లు చేస్తున్నారని, మరొకరు కమీషన్లు దండుకుంటున్నారని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ఆరోపించారు. రాష్ట్రంలో 16 నెలల కాంగ్రెస్ పాలన అంతా మోసాలతోనే నడుస్తున్నదని, ప్రతీ మంత్రీ ముఖ్యమంత్రిగానే వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. బోనకల్లులో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులా మారిందన్నారు.
ఆ సభలో కేసీఆర్ కనీసం తన పేరును కూడా ఉచ్ఛరించలేదని సీఎం రేవంత్రెడ్డి బాధపడుతున్నారని అన్నారు. రిటైర్డు ఉద్యోగులకు బెనిఫిట్స్ రాకపోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించినా కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేయడంతో అకాల వర్షాలతో రైతుల ధాన్యం తడిసిపోతోందని అన్నారు. పదో తరగతి ఫలితాలు విడుదల చేసే క్రమంలో సీఎం రేవంత్రెడ్డి కేసీఆర్పై విమర్శలు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. మంత్రుల మధ్య సఖ్యత లేదని, మరోసారి ప్రభుత్వం వచ్చే పరిస్థితి లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రానికి మళ్లీ కేసీఆరే శ్రీరామరక్షగా నిలుస్తారని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రాబోయే రోజుల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు బంధం శ్రీనివాసరావు, బానోత్ కొండా, వేమూరి ప్రసాద్, ఇటికాల శ్రీనివాసరావు, కొనకంచి నాగరాజు, పారా ప్రసాద్, మూడావత్ సైదా, ఎంగల కనకయ్య, గద్దల వెంకటేశ్వర్లు, కొమ్మినేని ఉపేంద్ర, షేక్ నజీర్, తాళ్లూరి ప్రేమానందం, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.