టేకులపల్లి, డిసెంబర్ 15 : ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్ ధీమా వ్యక్తం చేశారు. మద్రాస్తండా పంచాయతీ పరిధి కొండంగలబోడులో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ జర్పుల శాంతి, తారాచంద్ దంపతులు, వివిధ పార్టీలకు చెందిన 20 కుటుంబాలు మాజీ సర్పంచ్ మాలోత్ రాజేందర్, మాజీ ఎంపీటీసీ జర్పుల భద్రమ్మ లచ్చుల ఆధ్వర్యంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వీరికి హరిప్రియానాయక్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మాజీ ఎంపీపీ జర్పుల శాంతి, జర్పుల తారాచంద్, శేఖర్, కిషన్, దేవ, లింగ, రాంజీ, చిన్న రాంజీ, దరావత్ నరేశ్, రామ్చంద్ తదితరులు ఉన్నారు. అనంతరం హరిప్రియ మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందని, కష్టపడి పనిచేసిన వారికి భవిష్యత్లో మంచి స్థానం ఉంటుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భూక్యా దళ్సింగ్, మాలోత్ రాజేందర్, జర్పుల భద్రమ్మ, లచ్చు పాల్గొన్నారు.