వరంగల్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన రజతోత్సవ సభ ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అనర్గళ ప్రసంగం అమితంగా ఆకట్టుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టిన తీరు కార్యకర్తలను ఆలోచింపజేసింది. భవిష్యత్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుసల్పాలన్న కృతనిశ్చయాన్ని కలుగజేసింది. కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించాల్సిందేనంటూ కేసీఆర్ చేసిన దిశానిర్దేశం పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, ప్రజాప్రతినిధులపై తీవ్ర ప్రభావం చూపింది. పార్టీ కార్యకలాపాలపై మరింత దృష్టి సారించేలా ఎల్కతుర్తి సభ సమాయత్తం చేసింది. రాజకీయ ప్రత్యర్థులపై కేసీఆర్ పేల్చిన మాటల తూటాలు నయా జోష్‌ను నింపాయి.
-ఖమ్మం, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
రజతోత్సవ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్.. దాదాపు నెలరోజుల ముందు నుంచే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దీంతో తెలంగాణ ఉద్యమ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర అన్ని వర్గాల ప్రజలు సభకు పెద్ద సంఖ్యలో తరలారు. సభ నిర్వహించిన ఎల్కతుర్తికి సుదూరంగా ఉన్న భద్రాచలం, అశ్వారావుపేట, సత్తుపల్లి, పినపాక, ఇల్లెందు, మధిర, కొత్తగూడెం, వైరా, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు అంచనాలకు మించి తరలివెళ్లడం.. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ చెక్కుచెదరలేదనేందుకు నిదర్శనమని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బస్సులు సభకు వెళ్లకుండా అధికారుల ద్వారా ప్రభుత్వం ప్రయత్నించినా మొక్కవోని దీక్షతో పార్టీ శ్రేణులు ఎల్కతుర్తికి కదంతొక్కాయి. అధికారుల నిర్వాకంపై పార్టీ జిల్లా నేతలైన మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి తదితరులు మండిపడ్డారు. అధికారులను నిలదీసి మరీ దగ్గరుండి బస్సులను పంపించారు.
గతంలో ఎన్నడూలేని విధంగా ప్రతి గ్రామం నుంచీ పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు కదిలారు. ‘ఎల్కతుర్తికి ఎల్దమొస్తవా?’ అనుకుంటూ పయనమయ్యారు. ముఖ్యంగా మహిళలు అమితాసక్తి చూపించారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇక పోరుబాట పట్టాలని, ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడగాలని ఎల్కతుర్తి సభ స్ఫూర్తినిచ్చినట్లయింది. అయితే, ఈ రజతోత్సవ సభ సామాన్యుల్లోనూ కొత్త ఆశలను చిగురింపజేసింది. అధినేత కేసీఆర్ ప్రసంగం పార్టీ శ్రేణుల్లోనే గాక.. ప్రజల్లోనూ భరోసా నింపింది. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ ఏ విధంగా పురోగమించిందో.. ఉమ్మడి జిల్లా ఎంతలా అభివృద్ధి చెందిందో, సంక్షేమ పథకాలు ఎలా అందాయో అనే అంశాలను అన్ని వర్గాల ప్రజలూ బేరీజు వేసుకున్నారు. మరోసారి బీఆర్ఎస్కు అండగా ఉండేందుకు సంసిద్ధులవుతున్నారు. ఎల్కతుర్తి సభలో కేసీఆర్ మాట్లాడిన ప్రతీమాట ఎన్నో ప్రశ్నలను తెరపైకి తెచ్చింది. సభ అనంతరం గ్రామకూడళ్లలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. పదేళ్లలో సాధించిన అభివృద్ధిని, ప్రస్తుత పరిస్థితులను సామాన్యులు సైతం బేరీజు వేసుకుంటున్నారు.
గత బీఆర్ఎస్ పాలనలో ప్రతి రైతు చేనులో ధాన్యపు సిరులు విలసిల్లాయని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటూ చర్చించుకుంటున్నారు. రైతు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనుగోలు చేసే దిక్కు లేకపోవడంతో రైతులు గోడుమంటున్నారు. గత దశాబ్దంలో కేసీఆర్ అందించిన అండదండలను మననం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి యువకులు, రైతులు, మహిళలు, విద్యార్థులు, మేధావులు సహా అన్ని వర్గాల ప్రజలు రజతోత్సవ సభకు తండోపతండాలుగా తరలివెళ్లారు. కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు, ఆయన పిలుపునందుకొని భవిష్యత్ కార్యాచరణకు దిగేందుకు సంసిద్ధులయ్యేలా సభకు ప్రత్యక్షంగా హాజరయ్యారు. స్వచ్ఛందంగా హాజరై అత్యంత కుతూహలంగా ప్రసంగాన్ని వినడం ద్వారా.. కాంగ్రెస్‌పై వ్యతిరేకత ఏ విధంగా ఉందో అర్థమవుతోందని బీఆర్ఎస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అధికారం కోల్పోయి ఏడాదిన్నర గడుస్తున్నా పార్టీ కార్యకర్తల్లో ఉన్న అభిమానం చెక్కుచెదరకపోవడాన్ని ఈ సభ నిరూపించిందని భావిస్తున్నారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజలపక్షమేనని ఈ సభ చాటిచెబుతోందని అంటున్నారు.
ఎల్కతుర్తి సభకు ఉమ్మడి జిల్లా నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లడంపై కాంగ్రెస్ నేతల్లో అంతర్మథనం మొదలైంది. ఏయే ప్రాంతాల నుంచి ఎంతమేరకు జనం తరలివెళ్లారన్న అంశంపై వారు ఆరాతీసినట్లు తెలుస్తోంది. ఎన్ని ఆటంకాలు సృష్టించినా, నిర్బంధాలు పెట్టినా పార్టీ శ్రేణులు సభకు వెళ్లిన తీరును చూస్తుంటే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు తిరుగులేదన్న భావన కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. పార్టీ బలోపేతంపై మరింత దృష్టిసారించేలా బీఆర్ఎస్ శ్రేణులను ఎల్కతుర్తి సభ కార్యోన్ముఖులను చేసింది. అయితే, వచ్చే ఏ ఎన్నికల్లోనైనా బీఆర్ఎస్ సత్తా చాటేందుకు కేసీఆర్ చేసిన దిశానిర్దేశం ఉపయోగపడనున్నట్లు పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.