కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఖమ్మం నగరంలోని 57వ డివిజన్లో స్థానిక కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త ముస్తాఫా ప్రభుత్వ భూములను ఆక్రమించి ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నాడు. ఆ ప్రాంతంలో పాఠశాల, కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసమని గత కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన స్థలాలు ఆక్రమణకు గురైన విషయాన్ని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు పత్రికల ద్వారా వెలుగులోకి తెచ్చారు. దీంతో అధికారులు స్పందించి శనివారం ఆ స్థలాలను పరిశీలించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనట్లు గుర్తించిన అధికారులు ఆ స్థలంలోని కట్టడాలను కూల్చేయాలని ఆదేశాలు జారీ చేశారు. త్వరలో ఆ భూముల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు.
– ఖమ్మం, మార్చి 1
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 57వ డివిజన్లో గల పాఠశాల, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి గత కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని స్థానిక కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త ముస్తాఫా కబ్జా చేసి ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నాడు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు వెలుగులోకి తేవడంతో శనివారం రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు.
సర్వే నెంబర్ 64లోని ప్రభుత్వ స్థలాలను ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి నర్సింహారావు, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ రవికుమార్, ఆర్ఐ వహీద్ పరిశీలించారు. ప్రభుత్వ భూముల్లో బేస్మెంట్ కట్టడాన్ని గుర్తించిన ఆర్డీవో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులతో మాట్లాడారు. వెంటనే అక్రమ కట్టడాలను కూల్చివేసి సంబంధిత మెటీరియల్‌ను డంపింగ్ యార్డ్‌కు తరలించాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఖమ్మం అర్బన్ తహసీల్దార్‌ను ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించాలని చూస్తే ఎంతటి వారైనా సహించమని హెచ్చరించారు. అక్రమ కట్టడాలను కూల్చివేయాలని కార్పొరేషన్ అధికారులను కోరినట్లు తహసీల్దార్ తెలిపారు.
57వ డివిజన్ పరిధి రమణగుట్ట ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2016లో సర్వే నెంబర్ 64లో ప్రాథమిక పాఠశాల నిర్మాణం కోసమని 7 గుంటల భూమిని, కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసమని 6 గుంటల భూమిని కేటాయించారు. ఆ స్థలాన్ని ఖమ్మం మున్సిపాలిటీకి అప్పగించారు. వీటికి సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మాణాలకు సైతం ప్లాన్లు తయారు చేశారు.. కానీ నిధులలేమి కారణంగా అప్పట్లో ఆయా నిర్మాణాలు జరగలేదు. ఆ సమయంలో ఆ డివిజన్ కార్పొరేటర్‌గా ప్రస్తుత బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు ఉన్నారు.
ఆయన చొరవతోనే గత ప్రభుత్వం ఆయా స్థలాలను పాఠశాల, కమ్యూనిటీ హాల్‌కు కేటాయించడం జరిగింది. ఆ భూముల్లో ప్రస్తుత స్థానిక కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త ముస్తాఫా గత నెల రోజుల నుంచి జేసీబీల సహాయంతో క్లీన్ చేసి ప్లాట్లు చేసి విక్రయిస్తున్నాడు. అదేవిధంగా అదే ప్రాంతంలో గతంలో గ్రేవీ యార్డు కోసం 2 ఎకరాల భూమిని గత కేసీఆర్ ప్రభుత్వం కేటాయించింది. యార్డు నిర్మాణానికి రూ.1.50 కోట్ల నిధులు సైతం మంజూరయ్యాయి. ఐతే ఆ ప్రాంతంలో నాగార్జునసాగర్ కాలువ ఉండటం వల్ల యార్డు నిర్మాణానికి అడ్డంకిగా ఉండటంతో ఆ నిధులను రమణగుట్టకు వెళ్లే 60 అడుగుల ప్రధాన రోడ్డు నిర్మాణానికి కేటాయించారు.
ఆ భూమిని సైతం ముస్తాఫా ఆక్రమించి ప్లాట్లు చేసి విక్రయిస్తున్న విషయాన్ని నాగరాజు శుక్రవారం పత్రికల ద్వారా వెలుగులోకి తెచ్చారు. ముస్తాఫా ఆగడాలకు అంతులేకుండా పోయాయని, విద్యుత్ మీటర్లు ఇప్పిస్తానని లక్షల రూపాయలు పేదల నుంచి వసూలు చేస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులే తనకు చెబుతున్నారని నాగరాజు ఆరోపించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని గతంలో డబ్బులు వసూలు చేసిన వారికి సంబంధిత స్థలాల్లో ప్లాట్లు ఇస్తున్నాడని, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ప్రభుత్వ భూములను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన రెవెన్యూ అధికారులు శనివారం ఆయా స్థలాలను పరిశీలించారు. అక్రమ కట్టడాలను కూల్చివేసి ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
గత ఎన్నికల్లో ముస్తాఫా భార్య గెలుపు కోసం ఎంతో కష్టపడి పనిచేశా.. ముస్తాఫా అన్యాయంగా ప్రభుత్వ భూములను రాత్రికి రాత్రే చదును చేసి అమ్ముకుంటున్నాడు. ఇదే విషయం కలెక్టర్, తహసీల్దార్‌కు విన్నవించాం. ఈ ప్రాంతంలో బడి లేదు. 22 ఏండ్ల నుంచి అంగన్వాడీ సెంటర్ అద్దె భవనంలో నడుస్తున్నది. ప్రభుత్వ భూములను వీటి కోసం కేటాయిస్తే బాగుంటుంది. ముస్తాఫా వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నది. అధికారులు విచారించి ప్రభుత్వ స్థలాలను కాపాడాలి.
– గొట్టెపర్తి శ్రీనివాస్, కాంగ్రెస్ కార్యకర్త, 57వ డివిజన్, ఖమ్మం
ఖమ్మం నగరంలోని 57వ డివిజన్లో గల ప్రభుత్వ భూములన్నింటికీ అధికారులు వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. కబ్జాకోరుల నుంచి ప్రభుత్వ భూములను కాపాడి ప్రజల అవసరాలను తీర్చడానికి ఉపయోగించాలి. కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉద్యోగాలు ఇప్పిస్తామని, విద్యుత్ మీటర్లు ఇప్పిస్తామని పేదల నుంచి డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారినుంచి పేదలను ప్రభుత్వమే కాపాడాలి.
– పగడాల నాగరాజు, బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు. ఖమ్మం 57వ డివిజన్ పరిధి రమణగుట్ట ప్రాంతంలోని సర్వే నెంబర్ 64లో ప్రభుత్వ భూములను శనివారం పరిశీలించాం. అందులో నిర్మించిన అక్రమ కట్టడాలను వెంటనే కూల్చివేయాలని అధికారులను ఆదేశించాం. ఆ భూముల చుట్టూ త్వరలో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాం. దళారుల మాటలు నమ్మి ప్రభుత్వ భూములను కొని ఎవరూ మోసపోవద్దు.
– జి.నర్సింహారావు, ఖమ్మం, ఆర్డీవో