ఖమ్మం, సెప్టెంబర్ 12: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ గూండాలను తక్షణమే అరెస్టు చేయాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
కౌశిక్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. పట్టపగలే ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయడం, ఎమ్మెల్యేపై హత్యాయత్నం చేయడం అంటే రాష్ట్రం ఎటుపోతోందని ప్రశ్నించారు. ఫ్యాక్షన్‌కు, రౌడీ రాజకీయాలకు తెలంగాణను అడ్డాగా మార్చేస్తుండడం బాధాకరమని అన్నారు. కౌశిక్‌రెడ్డిని గృహనిర్బంధంలో ఉంచి గూండాలతో దాడి చేయిస్తారా అంటూ ప్రశ్నించారు.
ఇందిరమ్మ రాజ్యమంటే ఎమ్మెల్యేకు కూడా రక్షణ లేకపోవడమేనా అంటూ దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై న్యాయపరంగా పోరాడుతున్నందునే కౌశిక్‌రెడ్డిని టార్గెట్ చేశారని స్పష్టం చేశారు. ఇది కచ్చితంగా సీఎం రేవంత్‌రెడ్డి చేయించిన దాడేనని అన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఉడుత ఊపులకు బెదరబోమని స్పష్టం చేశారు. తదుపరి ఎన్నికల్లో కేసీఆర్‌ను జనాలు ఆశీర్వదిస్తారని అన్నారు.