చండ్రుగొండ/ తిరుమలాయపాలెం/ కూసుమంచి/ మణుగూరు టౌన్/ వైరా టౌన్, జనవరి 26: నాలుగు పథకాల మంజూరు పత్రాల పంపిణీలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం నాలుగు చోట్ల రసాభాస జరిగింది. పథకాల గురించి ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నేతలు గూండాగిరీ ప్రదర్శించారు. సంక్షేమ పథకాలను అర్హులకెందుకు ఇవ్వలేదని అడిగిన బీఆర్ఎస్ చండ్రుగొండ నాయకులపై ఏకంగా దాడులకు పాల్పడ్డారు. అడ్డుకున్న జీసీసీ తాత్కాలిక ఉద్యోగినీ చితకబాదారు.
దీంతో అతడు తీవ్రగాయాలయ్యాడు. ఇక తిరుమలాయపాలెం మండలంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు నిరసన వ్యక్తమైంది. తాము అర్హులమైనప్పటికీ పథకాల జాబితాలో తమ పేర్లను ఎందుకు చేర్చలేదంటూ మహిళలు, గ్రామస్తులు నిలదీశారు. కూసుమంచి మండలంలోని ధర్మతండాలోనూ అర్హుల జాబితాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులను గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26నే లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ నెల 21 నుంచి 24 వరకూ గ్రామసభలు నిర్వహించి అర్హుల జాబితాను ప్రకటించింది.
ఆ జాబితాలో అర్హుల పేర్లు లేకపోవడం, అనర్హుల పేర్లతో జాబితా నిండి ఉండడం, దీంతో పేదలు పెద్ద సంఖ్యలో వచ్చి ఆయా గ్రామసభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవడం వంటివి చోటుచేసుకున్నాయి. అయితే, గ్రామసభల్లో అర్జీలు ఎక్కువగా వచ్చినందున తుది జాబితాను సిద్ధం చేసి ఫిబ్రవరి మొదటి వారంలో పథకాలు పంపిణీ చేస్తామని, ఈ లోగా జాబితాలు సక్రమంగా ఉన్న వాటిల్లో మండలానికి ఒక గ్రామం చొప్పున పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసిన వాటిల్లో జనవరి 26నే సభలు పెట్టి లబ్ధిదారులకు పథకాల మంజూరు పత్రాలు అందజేస్తామని ప్రకటించింది.
అందులో భాగంగానే ఉమ్మడి ఖమ్మంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ క్రమంలో అర్హులకు పథకాలు ఎందుకు రాలేదని అడిగినందుకు చండ్రుగొండ బీఆర్ఎస్ నాయకులపై అధికార పార్టీ నేతలు దాడికి పాల్పడ్డారు. అర్హులమైన తమకు మంజూరు పత్రాలు ఎందుకు ఇవ్వడంలేదంటూ తిరుమలాయపాలెం మండల ప్రజలు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను నిలదీశారు. జాబితాలో మొత్తం అనర్హులే ఉన్నారంటూ కూసుమంచి మండలం ధర్మతండా వాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన తిరుమలాయపాలెం మండలం ఏలువారిగూడెంలో అధికార పార్టీ నేతలను గ్రామస్తులు, మహిళలు నిలదీశారు. గ్రామంలో 13 మందికి ఇందిరమ్మ ఇళ్లు, 18 మందికి రేషన్ కార్డులు, 22 మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 208 మంది రైతులకు రైతుభరోసా మంజూరైనట్లు అధికారులు ప్రకటించారు. కానీ కొద్దిమందికి మాత్రమే మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాబితాలోని పేర్లన్నీ అనర్హులవేనని మహిళలు సభలో నిరసన తెలిపారు.
అధికారులను, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. తాను 20 రోజులకంటే అధికంగానే ఉపాధి హామీ పని చేసినప్పటికీ తన పేరును ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో ఎందుకు చేర్చలేదంటూ పచ్చిపాల అలివేలు అనే మహిళ వేదిక వద్దకు దూసుకెళ్లి అధికారులను, కాంగ్రెస్ నేతలను నిలదీసింది. కోట రాంబాయి, వీరపొంగు ముత్తమ్మ తదితరులు కూడా అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు అధికారులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు స్పందిస్తూ.. దశలవారీగా పథకాలు అందిస్తామంటూ చెప్పి సభ నుంచి వెళ్లిపోయారు.
అర్హత లేనివారికి మంజూరు పత్రాలు అందిస్తున్నారంటూ కూసుమంచి మండలం ధర్మతండా వాసులు అన్నారు. గ్రామసభలో మంజూరు పత్రాల పంపిణీపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అర్హత లేని వారికి, సాగు భూములు ఉన్న పథకాలు ఎలా మంజూరు చేస్తారంటూ ప్రశ్నించారు. అర్హులను పక్కన బెట్టి అనర్హులకు పత్రాలు అందజేస్తున్నారని అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు కట్టడి చేశారు.
సంక్షేమ పథకాలు అర్హులకు రాలేదని అధికారులను అడుగుతున్న సమయంలో అదును చూసి బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు పంచాయతీలో ఆదివారం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సమక్షంలో పథకాల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. కానీ గ్రామంలో అర్హులైన చాలామంది పేర్లు పథకాల జాబితాలో లేవు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ జిల్లా నాయకుడు మేడా మోహన్‌రావు.. పథకాలు రాని కొందరితో కలిసి బెండాలపాడు పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లారు. అప్పటికే పంపిణీ కార్యక్రమం ముగిసి ఎమ్మెల్యే వెళ్లిపోయారు. కానీ అధికారులు అక్కడే ఉన్నారు.
దీంతో మోహన్‌రావు.. ఎంపీడీవో అశోక్ దగ్గరకు వెళ్లి పథకాలు అర్హులందరికీ ఎందుకు వర్తింపజేయడంలేదని అడుతున్నారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఈసం నాగభూషణం, బొర్రా సురేశ్, పొట్ట రాములు.. బీఆర్ఎస్ నేత మేడా మోహన్‌రావుపై దాడికి దిగారు. ఆ సమయంలో అక్కడే ఉన్న జీసీసీ తాత్కాలిక ఉద్యోగి కొడెం రవి.. ఈ దాడిని అడ్డుకున్నాడు. దీంతో మరింత రెచ్చిపోయిన కాంగ్రెస్ నాయకులు.. మోహన్‌రావుపైనా, రవిపైనా తీవ్రంగా దాడి చేశారు.
దీంతో కొడెం రవికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పంచాయతీ కార్యాలయం ఎదుట క్షతగాత్రులతో కలిసి ఆందోళన చేపట్టారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్ఐ శివరామకృష్ణ అక్కడకు చేరుకొని దాడిలో గాయపడ్డ కొడెం రవిని ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని బీఆర్ఎస్ శ్రేణులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే దాడి చేసిన వారిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. కాగా, ఈ దాడిని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు వేర్వేరు ప్రకటనల్లో తీవ్రంగా ఖండించారు. బాధితులను ఫోన్లలో పరామర్శించారు.
గత ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా వైరా మండలం పుణ్యపురం గ్రామసభలో పథకాల మంజూరు పత్రాలను వైరా ఎమ్మెల్యే పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో ‘మా గ్రామానికి ఇంతవరకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు వంటి సంక్షేమ పథకాలేమీ అందడంలేదు’ అంటూ సభలోని ఓ మహిళ.. ఎమ్మెల్యే రాందాస్‌ను నిలదీసింది. దీంతో ఎమ్మెల్యే దాటవేత సమాధానం చెబుతూ.. గత ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసహనం వ్యక్తం చేశారు.
‘మా ఊళ్లో రేకుల ఇళ్లు, గుడిసెలు ఉన్నవాళ్లకు కూడా ఇందిరమ్మ ఇళ్లు రాలేదు. అసలైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు రాకపోవడం అన్యాయం. కొద్దిమందికే ఇళ్లు మంజూరు చేశారు. వారికే ఈ రోజు ఆ మంజూరు పత్రాలు అందించారు. అందులోనూ అనర్హులు ఉన్నారు. ఈ విషయం మాకు ముందే తెలిస్తే అనర్హులకు కాగితాలు ఇవ్వకుండా చేసేవాళ్లం. నాకు అర్హత ఉన్నప్పటికీ ఇందిరమ్మ ఇల్లు రాలేదు.’
-గుగులోత్ ఉపేందర్, ఏలువారిగూడెం, తిరుమలాయపాలెం