– పట్టించుకోని అధికారులు
టేకులపల్లి, ఫిబ్రవరి 18 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్రతరమవుతుంది. ఏ రోడ్డు చూసినా ఆక్రమణలకు గురికావడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్డు విస్తరణలో భాగంగా ఎన్హెచ్ 930పి ఎప్పుడు పూర్తవుతుందో, ఈ ఇబ్బందులు ఎప్పుడు తొలుగుతాయో అని మండల ప్రజలు ఎదురు చూస్తున్నారు. టేకులపల్లి మండల కేంద్రంలోని బోడ్ క్రాస్ రోడ్ ప్రధాన కూడలిలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిపి ఇతర వాహనాలు వెళ్లేందుకు వీలులేకుండా రోడ్డుపైనే పార్కింగ్ చేస్తుండడంతో ఇబ్బందులు తీవ్రమౌతున్నాయి.
అధికారులు గాని పాలకులు గాని పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు టేకులపల్లి మండలంలోని కోయగూడెం ఉపరితల గని నుండి వందలాది బొగ్గు లారీలు తిరుగుతున్న క్రమంలో రోడ్డు ఇప్పటికే ఇరుకుగా ఉందంటే రోడ్డును ఆక్రమించడంతో మరింత ఇరుకుగా మారింది. రాకపోకలకు మరింత ఇబ్బందికరంగా మారిందని ప్రజలు వాపోతున్నారు. అధికారులు పట్టించుకుని రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ సమస్య ఎదురవకుండా, రోడ్లపై వాహనాలు నిలపకుండా, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

టేకులపల్లిలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు