Strawberries | మన ఆరోగ్యానికి మేలు చేసే పండ్లల్లో స్ట్రాబెర్రీలు ఒకటి. ఇవి అనేక పోషకాలతో నిండి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో విటమిన్ సి, మాంగనీస్, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, మెదడు పనితీరును పెంచడంలో, జీర్ణక్రియకు ఇలా అనేక రకాలుగా స్ట్రాబెర్రీలు మనకు సహాయపడతాయి. ఆహారంలో భాగంగా స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
స్ట్రాబెర్రీల్లో విటమిన్ సి, ఆంథోసైనిన్లు, ఎలాజిక్ ఆమ్లం వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్పెక్షన్ లతో పోరాడే సామర్థ్యం పెరుగుతుంది. స్ట్రాబెర్రీల్లో ఫైబర్, ఫ్లేవనాయిడ్లు, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే స్ట్రాబెర్రీల్లో మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి మెదడు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి ఫ్రీరాడికల్స్ వల్ల మెదడు కణాలు దెబ్బతినకుండా కాపాడడంలో సహాయపడతాయి. దీంతో అభిజ్ఞా క్షీణత ప్రమాదం తగ్గుతుంది. దీర్ఘకాలిక మెదడు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి.
అదే విధంగా స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వయసు పైబడడం వల్ల వచ్చే మాక్యులర్ క్షీణత ప్రమాదం తగ్గుతుంది. దృష్టి సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. స్ట్రాబెర్రీల్లో శోథ నిరోధక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో దీర్ఘకాలిక వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. స్ట్రాబెర్రీల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కనుక వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అలాగే స్ట్రాబెర్రీలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటాయి. కనుక వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా ఉంటాయి. ఇక స్ట్రాబెర్రీల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ప్రేగు కదలికలు మెరుగుపడతాయి. మలబద్దకం తగ్గుతుంది. ఈ విధంగా స్ట్రాబెర్రీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.