ఖమ్మం, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పాలన అంటేనే దళారుల రాజ్యం.. ఆ పార్టీ నేతలే దళారుల అవతారం ఎత్తుతారు. నీకు ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, పింఛను కావాలన్నా.. వారి చేయితడపాల్సిందే. ఏ ప్రభుత్వం పథకం కొత్తగా వచ్చినా వాళ్లదే రాజ్యం.. భూకబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు రాజ్యమేలిన రాజ్యం కాంగ్రెస్ రాజ్యమే. కాంగ్రెస్ పాలనలో భూ సమస్యలకు పరిష్కారం చూపే నాథుడే ఉండేవాడు కాదు. బూజు పట్టి, చెదలు పట్టి ఉన్న రెవెన్యూ చట్టాల్లో లొసుగులు అధికారుల పాలిట బంగారు గుడ్లు పెట్టే బాతులు. అధికారి చెప్పిన అమౌంట్ సెట్ చేస్తే చాలు.. ఎవరి భూమి ఎవరి పేరునైనా రాసి ఇస్తారు.. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే సర్వే నంబర్లకు ‘బై..’ కల్చర్ పుట్టుకొచ్చింది. భూబకాసరుల భూకబ్జాలకు హద్దు పద్దూ ఉండేది కాదు. ఒక రైతు అవసరమొచ్చి భూమిని అమ్మితే, కొన్న వ్యక్తి రిజిస్ట్రేషన్ పెద్ద ప్రహసనం. రిజిస్ట్రేషన్ కోసం ఏళ్ల పాటు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సివచ్చేది. ఈ సమస్యలన్నింటినీ అర్థం చేసుకున్న కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత సీఎంగా భూరికార్డుల ప్రక్షాళన చేశారు. కొత్త రెవెన్యూ చట్టాలు తెచ్చారు. భూములు, భూరికార్డుల భద్రత కోసం ‘ధరణి’ పోర్టల్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు రైతు భౌతికంగా రెవెన్యూ కార్యాలయంలో హాజరైతే తప్ప వేరొకరి పేరుపై రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేని పటిష్ట వ్యవస్థను తీసుకొచ్చారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేతలు రైతుబంధును బంగాళాఖాతాలో కలుపుతామంటున్నారు. పంటలకు కేవలం మూడు కరెంట్ ఇస్తామంటున్నారు. రైతులు 10 హెచ్‌పీ మోటర్లు బిగించుకోవాలంటున్నారు. ఇలాంటి అతీగతి లేని మాటలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల పాటు కరెంట్ ఇస్తుంటే, కేవలం మూడు గంటలు కరెంట్ సరిపోతుందని వ్యాఖ్యలు చేయడంపై మండిపడుతున్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్, భూముల భద్రతకు ధరణి అవసరమని తేల్చి చెప్తున్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామంటున్నారు.
రేవంత్‌రెడ్డి చెప్పినట్లు 3 గంటల కరెంట్ అయితే రైతులు నిండా మునగక తప్పదు. సోయి ఉండి మాట్లాడుతున్నారో.. సోయి తప్పి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. 10హెచ్‌పీ మోటర్లు అంటే అయ్యే పని కాదు. రైతులను ఆగం చేసుడు తప్ప మరేం లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇట్లనే చేసింది. రోజుకు రెండు మూడు గంటలు కరెంట్ ఇవ్వడంతో వ్యవసాయంతోపాటు చిన్న పరిశ్రమలు సైతం మూతపడ్డాయి. సీఎం కేసీఆర్ దయతో తిరిగి పూర్తిగా కోలుకున్నాయి. 24 గంటల కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదని కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితిల్లోనూ నమ్మబోను. ఆనాడు రైతులను అరిగోస పెట్టిన సంగతి ఎవరూ మరువలేదు.
గతంలో రెవెన్యూ కార్యాలయానికి పోవాలంటేనే హడలిపోయేవాళ్లం. కనీసం పహాణీ తీసుకోవాలంటే పైరవీకారులను పట్టుకోవాల్సి ఉంది. ఒకరి పేరుపై నుంచి మరొకరికి భూమి బదలాయింపు చేసుకోవాలంటే నానా యాతనపడ్డాం. కానీ.. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ విషయంలో చాలా మార్పులు వచ్చాయి. పట్టా బుక్ లేని ప్రతి ఒక్కరికి పాస్ పుస్తకం ఉచితంగానే ఇచ్చారు. భూమి వివరాలను మొత్తం ధరణిలోకి తీసుకురావడంతో చాలా తేలికైంది. నాభూమి వివరాలు చూసుకోవాంటే రెవెన్యూ కార్యాలయానికి పోవాల్సిన పని లేకుండా పోయింది. సెల్ఫోన్లోనే చూసుకునే అవకాశం కలిగింది. ఇంతమంచి ధరణి విధానం తీసివేస్తామనడం సరికాదు.
కాంగ్రెస్ అంటేనే ప్రతి ఒక్కరికి కరెంట్ కోతలు గుర్తుకొస్తాయి. గ్రానైట్ మొదలుకొని వ్యవసాయ అనుబంధ రంగాలు సైతం గతంలో అనేక ఇబ్బందుపడ్డాయి. వచ్చీరాని కరెంట్‌తో రైతులు తీవ్ర ఇబ్బందుపడ్డారు. తెలంగాణ రావడం, సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో తెలంగాణకు కొత్త వెలుగులు వచ్చాయి. ఇచ్చిన మాట ప్రకారం 24 గంటల కరెంట్ ఇచ్చాడు. ఇలాంటి పరిస్థితిలో మళ్లీ కాంగ్రెస్ నాయకులు కరెంట్‌పై పూటకో మాట మాట్లాడుతున్నారు. వాళ్ల మాటలను రైతులు, ప్రజలు వింటున్నారు. రాష్ట్రంలో ఇంతమంచి కరెంట్ ఇస్తున్న ప్రభుత్వాన్ని వదులుకునే ప్రసక్తే లేదు. మూడు గంటల కరెంట్‌పై మాట్లాడిన వారికి పది రోజుల్లో రైతులు తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.
గతంలో భూములు పట్టా చేయించాలంటే పైరవీలు చేయాల్సి వచ్చేది. కానీ.. కేసీఆర్ వచ్చిన తర్వాత పాస్ పుస్తకాలు ధరణిలో అవుతున్నాయి. పైరవీకారులు, లంచాలు లేకుండా పనులు అవుతున్నాయి. రైతు సొంతంగా మీ సేవకు పోయి స్లాట్ బుకింగ్ చేసుకుంటే పని అయిపోతుంది. ఇంటికి పోస్టులో పాస్ పుస్తకాలు వస్తున్నాయి. గతంలో ఏళ్ల తరబడి తిరిగినా కాకపోయేది. కానీ.. పనులు ఇప్పుడు సులువుగా అవుతున్నాయి. ధరణితో అందరి భూములకు భద్రత వచ్చింది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణితో పేద, మధ్యతరగతి రైతులకు, వారి భూములకు భద్రత కలిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులు అయిపోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ధరణి ఉండాల్సిందే.
రాత్రుళ్లు పొలాలకు, చేలకు నీరు పెట్టడానికి పోయి అక్కడే పడుకునేటోళ్లం. ఉన్న కొద్దిసేపు కరెంట్‌తో ఒకటి, రెండు మడులు తడిసేవి. మిగిలిన పంటకు నీరులేక ఇబ్బంది కలిగేది. కానీ.. ఇప్పుడు బావులు, బోర్లలో నీరు పుష్కలంగా ఉంది. నీరు బాగా దొరుకుతుంది. రెండు పంటలు పడుతున్నాయి. కోతలు లేకుండా పూర్తిగా కరెంట్ అందడంతో తోట, పొలం వేశాను. సీఎం కేఆర్ వచ్చిన తర్వాత కరెంట్ కష్టాలు తీరాయి. సాగునీరు కూడా బాగా అందుతుంది. గతంలో వర్షాధార పంటలు వేసే వాళ్లం. కానీ.. ఇప్పుడు యాసంగి, వానకాలం పొలాలు వేసుకొంటూ మిర్చి తోటలు వేస్తున్నాం. 24 గంటల కరెంట్ ఉండాలి. లేకపోతే మళ్లీ కరెంట్ కష్టాలు వస్తే పంటలు పండించుకోలేం.
గతంలో కరెంట్ కోతలతో చాలా ఇబ్బందులు పడ్డాం. రాత్రుళ్లు జాగారం చేసినం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో అలాంటి ఇబ్బంది లేకుండా 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. సాగునీరు కూడా బాగుండడంతో రెండు పంటలు పండుతున్నాయి. గతంలో రాత్రి కరెంట్‌తో అక్కడే ఉండే వాళ్లం. పొలాలకు పోవాలంటే భయం అయ్యేది. రాత్రిపూట కరెంట్ కష్టాలు కేసీఆర్ సారు వచ్చినాక తీరినయ్. ఉచితంగా 24 గంటల కరెంట్ ఇవ్వడం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పంటు పండించుకుంటున్నారు. నేను వేసిన పొలం, తోట బాగుంది. పోయిన ఏడాది కూడా మంచి లాభంగా వ్యవసాయం సాగింది. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ కావాల్సిందే. 10హెచ్‌పీ మోటర్లు మేము కొనలేం.. అంత భారం మోయలేం.
కాంగ్రెసోళ్లు ధరణిని తీసేస్తామంటున్నారు. ధరణి వచ్చిన తర్వాత ఒకే దగ్గర రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అయిపోతున్నాయి. రైతులకు రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టూ తిరిగే తిప్పలు తప్పాయి. ధరణి రద్దు చేస్తే రైతులు తిరిగి రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టూ గతంలో లాగా చెప్పులరిగేలా తిరగాలి. వీఆర్వోలు, పట్వారీల వెంబడి తిరగాలి. అయినా పని కాదు. ఇప్పుడు కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయ్యాక అవస్థలు పోయాయి. కాంగ్రెస్ సర్కారు వస్తే రైతులకు కష్టాలు మళ్లీ మొదలవుతాయి. రైతులు బ్రోకర్లు, పటేల్, పట్వారీల వెంట తిరిగి లంచాలు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా జీవిస్తున్నారు.
24 గంటలు ఉచిత కరెంట్‌తో పసిడి పంటలు పండిస్తున్నాం. కాంగ్రెస్ నాయకులు రేవంత్‌రెడ్డికి వ్యవసాయం మీద కనీస అవగాహన లేదు. చిన్న, సన్నకారు రైతులు 10 హెచ్‌పీ మోటర్లు వాడరు అనే విషయాన్ని గుర్తించాలే. రేవంత్‌రెడ్డి అలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడటం సరికాదు. నాకు 25 ఎకరాల భూమి ఉంది. ఇందులో రెండు, మూడు పంటలు సాగు చేస్తాను. రెండు, మూడు రోజులకోసారి నీరు పారిస్తా. నాకు 5 హెచ్‌పీ మోటరుతో పంటలకు సరిపడా నీరందిస్తున్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు కరెంట్ రైతులకు ఉచితంగా ఇస్తుంటే కాంగ్రెసోళ్లు ఓట్ల కోసం ఇలా రైతులతో రాజకీయం చేస్తున్నారు. అందుకే 24 గంటల ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసే కేసీఆర్ ప్రభుత్వానికే అండగా ఉంటాం.
మూడు గంటలు కరెంట్‌తో మా పొలాల సాగు కావు. కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లు మూడు గంటల కరెంట్‌తో రైతులు బాగుపడరు. మాకు మూడు ఎకరాల పొలం ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇవ్వడంతో 5 హెచ్‌పీ మోటర్లను వాడుతున్నాం. కాంగ్రెస్ మూడు గంటల కరెంట్ ఇచ్చి 10 హెచ్‌పీ మోటర్లతో పెట్టిస్తామని చెబుతున్నారు. రైతులందరూ ఒకేసారి 10 హెచ్‌పీ మోటర్లను చేస్తే ట్రాన్స్పార్మర్ పేలి పోయి సమీపంలో ఉన్న సబ్‌స్టేషన్ కాలిపోతాయి. రైతులతో పాటు, ఇళ్లలో కూడా కరెంట్ కష్టాలు మొదలవుతాయి. మా రైతులకు సర్కారు ఇచ్చే ట్రాన్స్ఫార్మర్లు 25 హెచ్‌పీవి ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ సర్కారు 24 గంటలు కరెంట్ ఇస్తుంది. పంటలు మంచిగా పడుతున్నాయి. దిగుబడి మంచిగా వస్తుంది.
రైతులకు మూడు గంటల విద్యుత్ దేనికీ సరిపోదు. ఏ అవగాహనతో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారో అర్ధం కావడంలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరెంటుతో రైతులు నిబ్బరంగా పొలాలకు నీరు పారించుకుంటున్నారు. రాత్రుళ్లు పొలాల వద్ద నిద్రించే బాధ తప్పింది. కాంగ్రెస్ వస్తే మళ్లీ కరెంటు కష్టాలే. విద్యుత్ ప్రమాదాలు మళ్లీ జరుగుతాయి. ఏ రైతుకు కూడా 10హెచ్‌పీ మోటర్ అవసరంలేదు. ఈ ప్రాంతంలో ప్రతి రైతు మూడు నుంచి ఐదు హెచ్‌పీ మోటర్లే వాడుతున్నారు.
రైతులకు మూడు గంటల కరెంటు చాలని, 10హెచ్‌పీ మోటర్లు వినియోగించాలని కాంగ్రెసోళ్లు చెప్పడం విడ్డూరంగా ఉంది. మా ప్రాంతంలో 10 హెచ్‌పీ మోటర్లు ఎవరూ వాడరు. మాకు 5 హెచ్‌పీ మోటర్లే సరిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఎందుకు 10హెచ్‌పీ మోటర్లు వినియోగిస్తారు. 10హెచ్‌పీ మోటర్ల కొనుగోలు కూడా అధిక ధరలు చెల్లించాల్సి వస్తుంది. కాంగ్రెస్ నాయకుల మాటలు చూస్తుంటే వారికి వ్యవసాయంపై అవగాహన లేదనిపిస్తుంది.
గతంలో భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మధ్యవర్తులను ఆశ్రయించాల్సి వచ్చేది. దళారులతో ఖర్చు భరించి పనిచేయించుకోవాల్సి వచ్చేది. తెలంగాణ ప్రభుత్వం ధరణి తీసుకురావడంతో తిప్పలు తప్పాయి. భూమి కొనుగోలు చేసిన వెంటనే అధికారులు రిజిస్ట్రేషన్ పూర్తిచేసి పాస్‌బుక్‌లో ఎక్కిస్తున్నారు. ధరణి వల్ల అన్నివిధాలుగా కచ్చితంగా ఉన్న భూములు అమ్మడం, కొనడంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. భూ రిజిస్ట్రేషన్ కోసం కేసీఆర్ తీసుకువచ్చిన ధరణి వ్యవస్థ చాలా బాగున్నది. కొత్త పాస్‌బుక్‌లో భూమి వివరాలు నమోదు కావడంతో వెంటనే రైతుబంధు కూడా చేతికొస్తుంది.
ప్రస్తుతం ధరణి పోర్టల్ ఉండడం వల్లనే భూములు, వాటి రికార్డులు భద్రంగా ఉంటున్నాయి. పటిష్టమైన భద్రత కవచాలు ఉన్న ధరణి తీసేసేందుకు కాంగ్రెస్ నేతలు కుట్రలు పన్నుతున్నారు. దానిని తీసేసి ఎంచక్కా వారి నైజం ప్రకారం పాత పద్ధతులు తెస్తారు. దీంతో రైతులకు తెలియకుండానే వారి భూములను మాయం చేస్తారు. ఇష్టానుసారంగా రికార్డులు మార్చేస్తారు. వ్యవసాయ భూముల్లో చిక్కు ముడులు లేకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారు. ఎవరి భూములు వారికి, ఎవరి రికార్డులు వారికి స్పష్టంగా ఉన్నాయి. అడ్డగోలుగా భూముల రికార్డులు మార్చడం, రైతుకు తెలియకుండానే క్రయవిక్రయాలు జరగడం వంటివి ధరణిలో జరగవు. రైతు వేలి ముద్ర లేకుండా అతడి భూముని తాకను కూడా తాకలేదు. ఈ విధానమే కాంగ్రెస్ నాయకులకు మింగుడు పడడం లేదు. గతంలో భూముల విషయంలో అనేక అవకతవకలు, గొడవలు, కోర్టు కేసుల వంటివి అనేకం చూశాం. కానీ నేడు ధరణి వచ్చాక అలాంటి తగాదాలు అవకాశం లేకుండా పోయింది. ఎన్నికల్లో లబ్ధి కోసమే ధరణిని ఎత్తివేస్తామంటూ రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్క ప్రచారం చేస్తున్నారు. ధరణి పోర్టల్ నూటికి నూరు శాతం ఉండాలి.
ధరణి పోర్టల్ అంటేనే కాంగ్రెస్ నేతలు శివాలెత్తుతున్నారు. దాని పేరు వింటేనే గడగడలాడుతున్నారు. అందుకే నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. ధరణి పోర్టల్ వల్ల కర్షకులు ఇంత ధైర్యంగా ఉంటుంటే.. కాంగ్రెస్ నేతలు ఎందుకో భయపడుతున్నారు. ధరణి వద్దేవద్దంటున్న వారి మాటలు ఎందుకో పెద్ద అనుమానమే కలిగిస్తున్నాయి..నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి వల్లనే మాలాంటి రైతుల భూములన్నీ భద్రంగా ఉన్నాయి. పైగా వాటి విలువ కూడా పెరిగింది. ఇంతకుమునుపు ఎవరైనా భూములు కొనాలంటే ఎంతో ఇబ్బందులు పడేవాళ్లు. ఆ భూములకు సంబంధించి సరైన పత్రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు సమస్తం ధరణిలో ఉంటున్నాయి. అమ్మే వారు, కొనే వారు వేలి ముద్ర పెడితే క్షణాల్లోనే భూముల బదలాయింపు జరుగుతుంది. దళారులకు తావే లేవు. కానీ కాంగ్రెస్ నేతల ప్రకారం పాత పద్ధతులు దళారులు, లంచాలతోనే రైతులు దగా పడతారు. అప్పట్లో రైతులు తమ భూములను తాము సాగు చేసుకుంటున్నప్పటికీ రికార్డులు తమ ఇంకా ఉందోలేదోననే ఆందోళన పడేవారు. ఇప్పుడిప్పుడే ధరణితో ధైర్యంగా ఉంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చినా, వారు చెబుతున్నట్లుగా ధరణిని నిలిపివేసినా మొదటగా మోసపోయేది రైతులే. అందుకే కాంగ్రెస్ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధరణి ఉండి తీరాల్సిందే.
కాంగ్రెసోళ్లు అన్నట్లు వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ ఇవ్వడమనేది పనికిరాని మాట. మూడు గంటల విద్యుత్ ఇస్తే మోటర్ల కెపాసిటీని పెంచాలి. అలా పెంచితే రైతులు పండించిన పంట మొత్తం మోటర్లు మార్చడానికి ఖర్చు చేయాల్సి వస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి ఇస్తున్న 24 గంటల విద్యుత్ సరఫరానే కరెక్ట్. రైతులు ఉన్న మోటర్లతోనే నిరంతర కరెంటుతో పంటలకు నీళ్లు పారించుకుంటున్నరు. ఇప్పుడిచ్చే
కరెంటు అన్ని వర్గాలకు బాగానే ఉంది.
ధరణి పోర్టల్ లేకపోతే రైతులు పండించిన ధాన్యం ఏ విధంగా కొనుగోలు చేస్తారు. ధరణి ఉన్నందువల్ల రైతుల వివరాలన్నీ తహసీల్దార్ కార్యాలయం, వ్యవసాయశాఖ కార్యాలయంలో ఉండడం వల్ల పండించిన ప్రతి గింజను కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. ధాన్యానికి సంబంధించి డబ్బులను రైతుల అకౌంట్లలో జమచేయడంతో పాటు రైతుబంధు కూడా అందిస్తున్నారు. ధరణి లేకుంటే అన్నదాతలకు పెట్టుబడి సాయం, వడ్ల డబ్బులు ఎలా వేస్తారో అర్ధం కావడంలేదు. ధరణి తీసేస్తే మళ్లీ పాతరోజులే వస్తాయి. కాంగ్రెస్ నాయకులకు రైతులు, వ్యవసాయంపై అవగాహన లేక ధరణి తీసేస్తామంటున్నారు.
కాంగ్రెస్ గెలిస్తే మూడు గంటల కరెంటు ఇస్తామంటుర్రు. మూడు గంటల కరెంటు ఇస్తే రైతులు ఇక మునుగుడే తప్ప మరో మార్గంలేదు. మళ్లీ పాత రోజులు రాక తప్పదు. రాత్రనక పగలనక తేడా లేకుండా బావులు, బోర్ల వద్దకు పోక తప్పదు. నిద్రాహారాలు మానక తప్పదు. రైతులు మృత్యువాత పడడం ఖాయం. కరెంటు కష్టాలు వద్దనుకుంటే కారు గుర్తుకు ఓటు వేయాలి. రైతులందరూ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే రైతు రాజ్యం మళ్లీ వస్తుంది. లేదంటే రాక్షసుల రాజ్యం వస్తుంది.
చిన్న, సన్నకారు రైతులు 10హెచ్‌పీ మోటర్లు ఏర్పాటు చేసుకోవడం ఎలా సాధ్యమవుతుంది. 10హెచ్‌పీ మోటర్లు అయితే మూడు గంటల కరెంటు సరిపోతుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. రూ.లక్షలు ఖర్చు చేసి ఒకటి రెండు ఎకరాల రైతులు 10హెచ్‌పీ మోటర్లు ఎలా పెట్టుకుంటారు. కాంగ్రెస్ గౌర్నమెంటు వస్తే సన్న, చిన్నకారు రైతులకు ఇబ్బందులు తప్పవు. బీఆర్ఎస్ పాలనలో 24 గంటల కరెంటు వస్తుంటే హాయిగా ఎప్పుడంటే అప్పుడు మోటరు పెట్టుకొని పొలం తడుపుకొంటున్నాం. కాంగ్రెస్ గెలిస్తే మనలాంటి చిన్న రైతులకు కష్టాలు తప్పవు. సన్న, చిన్నకారు రైతులు మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి.
ధరణి పోర్టల్‌తోనే రైతు భూములకు భరోసా వచ్చిందన్నారు. ప్రతి భూమిని ఆన్లైన్లో చూసుకునే పరిస్థితి రావడంతో రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లోపాలు లేకుండా చేసినైట్లెంది. ఒకరి భూమిని మరొకరికి బదలాయించే పరిస్థితి లేకుండా ఉంది. ధరణితోనే తెలంగాణ రైతులకు మంచి రోజులు వచ్చాయి. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని ప్రతిఒక్కరూ స్వాగతించాలి.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కరెంట్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి కరెంట్‌తో పొలాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. 24 గంటలు విద్యుత్‌తో పగలే పంట పొలాలకు నీళ్లు పెట్టుకొని రైతులు సంతోషంగా ఉన్నారు. మూడు గంటలు కరెంట్ ఇస్తామని నాయకుల మాటలు చెబితే పొలాలకు నీళ్లు సరిపోక పంటలు ఎండిపోతాయి. కరెంట్ కష్టాలు మొదలై రైతు ఆగమయ్యే ప్రమాదం ఉంది.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంట్‌తో రైతులు ఆగమయ్యే పరిస్థితి వస్తుంది. సీఎం కేసీఆర్ 24 గంటలు ఇస్తుంటేనే తెలంగాణ రాష్ట్రం ధాన్యరాసులతో తులతూగుతున్నది. అటువంటి తెలంగాణలో కాంగ్రెస్ అడుగు పెడితే తెలంగాణ రాష్ట్రం కరువు తాండవించే పరిస్థితులు నెలకొంటాయి. రైతులు ఆలోచించి కారు గుర్తుకు ఓటు వేయాలి.
భూస్వాములకు మేలు చేసేందుకే కాంగ్రెస్ ధరణి రద్దు చేస్తామంటున్నది. కేసీఆర్ ప్రభుత్వం పైసా ఖర్చు లేకుండ తెల్లకాగితాల మీద రాసుకున్న భూములకు మధ్యవర్తులను తొలగించి ఉచితంగా పట్టాలు ఇచ్చింది. మా భూములను ధరణిలో పెట్టింది. ధరణి పోర్టల్‌తో చిన్న, సన్నకారు రైతుల భూములకు రక్షణ ఏర్పడింది. ధరణి వల్ల రైతులకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. అలాంటి ధరణిని రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్‌ను ఓటు ద్వారా బంగాళాఖాతంలో కలపాల్సిందే.