ఇల్లెందు, జూన్ 21: పేద ప్రజల కోసం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తోందని ఉమ్మడి ఖమ్మంజిల్లా బీఆర్ఎస్ పార్టీ సభ్యత నమోదు ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో ఇల్లెందు నియోజకవర్గస్థాయి ఎస్ఐఆర్, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియనాయక్ అధ్యక్షతన బీఎల్ఏలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఖమ్మంజిల్లా బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావు, ఇల్లెందు నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్చార్జి చాడా కిషన్‌రెడ్డిలతో కలిసి మాట్లాడారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు అందివ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి మంత్రులు, నాయకులు రాష్ర్టాన్ని దోచుకుంటున్నారన్నారు.

బీఆర్ఎస్ కార్యకర్తలు, సానుభూతిపరులు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)పై అవగాహన కలిగి ఉండాలని, గ్రామాల్లో ఓట్లు గల్లంతు కాకుండా చూడాలని, బీఆర్ఎస్ సభ్యత్వ డిజిటల్ నమోదుపై చురుగ్గా పని చేయాలని కోరారు. తాతా మధు మాట్లాడుతూ ఇల్లెందు నియోజకవర్గంలో 30నెలల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని, కాంగ్రెస్ ఎమ్మెల్యే తను చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ చేశారు. రేగా కాంతారావు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న దోపిడీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు చేస్తున్న దోపిడీపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
చాడా కిషన్‌రెడి, హరిప్రియలు మాట్లాడుతూ ఎస్ఐఆర్ విషయంలో మహిళ ఓటర్ల మ్యాపింగ్ గురించి అవగాహన కలిగి ఉండాలని, 2025 ఓటరు లిస్ట్‌లో ప్రతి ఓటరుని బీఎల్వో 2002 లిస్ట్‌లో ఉన్న వాళ్ళతో లింక్ చేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్ బానోత్ హరిసింగ్‌నాయక్, బీఆర్ఎస్ నాయకులు లక్కినేని సురేందర్‌రావు, భూక్య ధళ్సింగ్, సిలిరి సత్యనారాయణ, ఎస్ రంగనాథ్, అబ్దుల్ జబ్బార్, నబి, ఘాజీ, వరప్రసాద్‌గౌడ్, భావ్‌సింగ్‌నాయక్, శీలం రమేష్, రాధాక్రిష్ణ, దేవిలాల్, కౌన్సిలర్లు దండు సారయ్య, పింగలి అనూన్య, పాబోల్ స్వాతి, మాజీ కౌన్సిలర్లు తోట లలితశారద, తార, నెమలి ధనలక్ష్మి, నారాయణమ్మ, రేణుక పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో 70 కుటుంబాలు చేరిక

ఇల్లెందు, జూన్ 21: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి కాంగ్రెస్, వివిధ పార్టీలకు చెందిన 70 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. ఆదివారం ఇల్లెందు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియనాయక్ ఆధ్వర్యంలో జరిగిన చేరికల కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మంజిల్లా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇల్లెందు మండలం చల్లసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలోని ముకుందాపురం, గార్ల మండలం గోపాలపురం గ్రామానికి చెందిన 70 కుటుంబాల వారు బీఆర్ఎస్లో చేరారు.
బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందాయని, కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటూ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా తక్కెళ్ళపల్లి, హరిప్రియ మాట్లాడుతూ పార్టీని, కేసీఆర్‌ను నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తాతా మధుసూదన్, రేగా కాంతారావు, చాడా కిషన్‌రెడ్డి, హరిసింగ్‌నాయక్, చల్లసముద్రం సర్పంచ్ యేపే శంకర్, శీలం రమేష్, బండారి శ్రీను, నాగేశ్వరరావు, శీలంశెట్టి రమేష్, బుడిగ మురళి, పానుగట్టి రాధాక్రిష్ణ, బానోత్ బాలు, బాదావత్ రాందాస్, నాగయ్య, వీరన్న, రాములు పాల్గొన్నారు.