కారేపల్లి, ఏప్రిల్ 01 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తుందని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూముల విక్రయాలను నిరసిస్తూ సీపీఐ(ఎం) చేపట్టిన ధర్నాకు వెళ్లకుండా కారేపల్లి మండలంలోని సీపీఐ(ఎం) నాయకులను పోలీసులు మంగళవారం తెల్లవారుజామునే అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. కొండబోయిన నాగేశ్వరరావుతో పాటు పార్టీ మండల కార్యదర్శి కె.నరేంద్ర, నాయకులు బానోత్ బన్సీలాల్, తలారి దేవప్రకాశ్, ముక్కా సీతారాములు, తేజావత్ చందర్‌ను స్టేషన్లో నిర్భందించారు. ఈ చర్యను నిరసిస్తూ నాగేశ్వర్రావు మాట్లాడారు.
సెంట్రల్ యూనివర్శిటీ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అమ్మకానికి పెట్టిందన్నారు. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టడాన్ని నిరసిస్తూ విద్యార్ధి సంఘాలు చేస్తున్న పోరాటానికి సీపీఐ(ఎం) సంఫీుభావం ధర్నా పూనుకోగా దానిని పోలీసులతో నిరంకుశంగా అణిచివేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజా పాలన అంటూ ప్రజలను నిర్భంధాలు పాలు చేస్తుందని దుయ్యబట్టారు. నిరంకుశంగా వ్యవహరించిన ఏ పాలకుడైనా ప్రజల చేతిలో చావుదెబ్బతిన్నాడని, అదే రీతిలే కాంగ్రెస్ ప్రభుత్వానికి పునరావృత్తం అవుతుందని హెచ్చరించారు.
అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేసి విద్యార్ధులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులను సీపీఐ(ఎం)నాయకులు కొండెబోయిన ఉమావతి, వజ్జా రామారావు, రేగళ్ల మంగయ్య, గాసరి మల్లయ్య, కేసగాని ఉపేందర్, అజ్మీర శోభన్, వల్లభినేని మురళి, యనమగండ్ల రవి, పండుగ కొండయ్య, ఎండీ.ఇస్మాయిల్, కొత్తూరి రామారావు, అన్నవరకు కృష్ణ ఖండించారు.