ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 20 : ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ పింఛన్దారులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దోకా చేసిందని ఎమ్మార్పీఎస్ ఖమ్మం రూరల్ మండల ఇన్చార్జి కనకం జనార్ధన్ మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు శనివారం ఎదులాపురం మున్సిపాలిటీ కార్యాలయం ముట్టడి చేయడం జరిగిందని ఆయన తెలిపారు. గడిచిన 20 నెలల క్రితం వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్ పెంపుపై భరోసా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు.
దివ్యాంగులకు నెలకు రూ.6 వేలు, ఇతర పింఛన్దారులకు నెలకు రూ.4 వేల చొప్పున అందిస్తామని ఓట్లు దండుకుని సీఎం రేవంత్ రెడ్డి ముఖం చాటేశాడన్నారు. సబ్బండ వర్గాల ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరమాలన్నారు. అనంతరం ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీను, సామ్రాజ్యం, సురేష్ నాయక్, బాన్య నాయక్, సైదులు, బొందయ్య, వెంకటయ్య, మైబుజ్ పాల్గొన్నారు.