కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో పట్టణాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోయాయి. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప ప్రస్తుత ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎక్కడా మచ్చుకైనా కనబడకపోవడం ఇందుకు నిదర్శనం. పట్టణాలు పచ్చగా ఉండాలని నాటి ప్రభుత్వం ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి పార్కులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో భాగంగా కొత్తగూడెం పట్టణంలో రామా టాకీస్ ఏరియా, బూడిదగడ్డ, జీఆర్ బస్తీలతోపాటు ఇతర ప్రాంతాల్లో ప్రజలకు చల్లదనం, ఆహ్లాదం కోసం పట్టణ పార్కులను ఏర్పాటు చేసింది. అయితే ఈ రెండేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో అధ్వానంగా తయారయ్యాయి. కొత్తగూడెం రాజీవ్ పార్క్ పరిధిలో ఉన్న పట్టణ ప్రకృతి వనం మరీ అధ్వానంగా మారింది. కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా మారినా అధికారులు ఇటువైపు చూడకపోవడంతో ప్రకృతి వనాలు వాడిపోయాయి. చెట్లకు నీళ్లు లేక.. సరైన పర్యవేక్షణ లేక బందెల దొడ్డిలను పోలి ఉండటంతో జనం ప్రకృతి వనాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.
– భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ)
నేటికీ పూర్తికాని అభివృద్ధి పనులు..
నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధిలో దూసుకుపోయిన కొత్తగూడెం పట్టణం నేడు కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యానికి అద్దంపట్టేలా దర్శనమిస్తున్నది. కొత్తగూడెం పట్టణంలో రైతు బజారుతోపాటు సరైన మార్కెట్లు లేకపోవడంతో అప్పటి మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి శంకుస్థాపనలు కూడా చేశారు. అయితే ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి. నేటికీ పూర్తికాలేదు. దీంతో కూరగాయల వ్యాపారులు ఆరుబయటే వర్షం వస్తే తడుస్తూ ఎండకు ఇబ్బంది పడుతూ వ్యాపారాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తమ బతుకులు మారకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెంలో ఎన్నో ఏళ్లుగా నాన్ వెజ్ వ్యాపారులకు అడ్డా లేకపోవడంతో సింగరేణి హెడ్డాఫీస్ ప్రాంతంలోని సంత ప్రదేశంలోనే విక్రయాలు చేస్తూ ఉండేవారు. దీంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గమనించి వారి కోసం నాన్ వెజ్ మార్కెట్‌ను మంజూరు చేసి నిర్మాణాన్ని ప్రారంభించింది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడంతో సంతలోనే నాన్ వెజ్ వ్యాపారులు చేపలు, మాంసం విక్రయాలు సాగిస్తున్నారు. వర్షం వస్తే వారి కష్టాలు వర్ణణాతీతంగా ఉంటాయి.
కొత్త మేయర్‌కు సమస్యల స్వాగతం
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధి మూలనపడింది. ప్రభుత్వం పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో పట్టణ ప్రకృతి వనాలు, మార్కెట్లు అలంకారప్రాయంగా మారాయి. ఇప్పుడు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కొత్తగూడెం మేయర్ మూడ్ గణేశ్‌కు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి అభివృద్ధికి బాటలు వేయాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. పట్టణ ప్రగతిపై సీపీఐ మార్క్ చూపెడతారా లేక కాంగ్రెస్‌తో జత కడతారో వేచిచూడాల్సిందే. అటు అధికార పక్షం.. ఇటు మిత్రపక్షం కలిసి పనిచేస్తారా లేక పెత్తనాలు చెలాయిస్తారో వేచిచూడాలి. సమస్యల పరిష్కారం కోసం మాత్రం బీఆర్ఎస్ పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
ప్రకృతి వనం బేజారైంది..
కేసీఆర్ ప్రభుత్వంలో ప్రకృతి వనం పచ్చని చెట్లతో పచ్చగా ఉండేది. ఇప్పుడు ఎండిపోయిన చెట్లతో ఆకులు రాలిపోయి ఎవరూ పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా ఉంది. పార్కులో ఉన్న బల్లాలు కూడా పగిలిపోయాయి. చూడటానికి కళావిహీనంగా కనిపిస్తున్నది. పిల్లలు ఆడుకోవడానికి పార్కు ఏర్పాటు చేసినా అదీ ఉపయోగపడటం లేదు. పట్టణ ప్రగతిపై ఎవరికీ పట్టింపు లేదు.
-హైమద్, స్థానికుడు, రామా టాకీస్ ఏరియా, కొత్తగూడెం
ఆరుబయటే వ్యాపారాలు చేస్తున్నాం..
గత ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రగతి చాలా బాగుంది. అప్పట్లోనే కొత్తగా వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. మాకు మంచి జరుగుతున్నదని సంబురపడ్డాం.. కానీ, ఇంతలోనే ప్రభుత్వం మారిపోయింది.. ఎక్కడ పనులక్కడ నిలిచిపోయాయి. మా పండ్ల దుకాణం ఎదుటనే కొత్త నిర్మాణాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు. అప్పటివరకు మేము వాన, ఎండలోనే వ్యాపారాలు చేసుకోవాలి.
– ఎండీ.హర్షద్, పండ్ల వ్యాపారి, కొత్తగూడెం