కూలీల వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డుల జారీని రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ నిలిపివేసింది. దీంతో కొత్త దరఖాస్తుల పరిశీలనకు బ్రేక్ పడింది. ఇప్పటికే ఉన్న జాబ్‌కార్డుల్లో సవరణలకూ అవకాశం కల్పించడం లేదు. ఫలితంగా అటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం లబ్ధికీ నోచుకోక, ఇటు ఉపాధి హామీ పనులు లభించక నిరుపేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ అమలుతో ఉపాధి జాబ్‌కార్డులకు డిమాండ్ పెరిగింది. దీంతో ఇప్పటికే సంక్షేమ పథకాల అమలుకు ఆపసోపాలు పడుతున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. కొత్త కార్డులు జారీ చేయకుండా ఆన్లైన్లో లాక్ చేసింది. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఉపాధి సిబ్బందికి మౌఖిక ఆదేశాలు అందాయి. దీంతోపాటు యాక్టివ్‌గా లేని జాబ్‌కార్డులను తనిఖీ చేసి తొలిగించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. దీనివల్ల అర్హులైన నిరుపేదలకు తీవ్ర అన్యాయం జరుగనున్నది.
-అశ్వారావుపేట, ఫిబ్రవరి 14
వలసలను నివారించి కూలీలకు స్థానికంగా ఉపాధి కల్పించే లక్ష్యంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పనుల కోసం వెళ్లే కూలీలకు జాబ్‌కార్డులు జారీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్లో లాక్ చేసింది. దీంతో సుమారు నెల రోజులుగా జాబ్‌కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. దీనికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. వ్యవసాయ భూమి లేని కూలీలకు ప్రభుత్వం ఆత్మీయ భరోసా పథకం కింద ఒక్కో దఫాకు రూ.6 వేల చొప్పున ఏటా రెండు దఫాలుగా రూ.12 వేల నగదు అందించేందుకు నిర్ణయించింది. ఇప్పటికే ప్రతీ మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ఆ గ్రామంలోని లబ్ధిదారులకు మొదటి విడతగా రూ.6 వేలను జమ చేసింది. మిగతా లబ్ధిదారులకు ఈ ఏడాది మార్చి 31లోగా జమ చేస్తామని చెప్పింది. అయితే, పథకం కింద లబ్ధి పొందాలంటే ఏడాదిలో కూలీలు కనీసం 20 రోజులు ఈ జాబ్‌కార్డుపై పని చేయాల్సి ఉంటుంది. దీంతో తదుపరి ఆర్థిక సంవత్సరంలో ఆత్మీయ భరోసాకు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ ఏడాది జాబ్ కార్డు పొంది దానిపై 20 రోజులు పనిచేసి ఉండాలి. ఇందుకోసం చాలామంది నిరుపేదలు జాబ్‌కార్డుల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే, నూతన జాబ్‌కార్డుల జారీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఫలితంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కూలీలు దూరమవుతున్నారు.
ఉపాధి హామీ కూలీలు పనుల కోసం దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో పరిశీలన పూర్తి చేయాలి. ధ్రువీకరణ పూర్తి కాగానే అర్హులైన కూలీలకు గ్రామపంచాయతీ స్థాయిలో ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది జాబ్‌కార్డును జారీ చేస్తారు. ఏడాదిలో ఎప్పుడైనా కూలీలు జాబ్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, ఓటరు ఐడీ, బ్యాంక్ పాసు పుస్తకం, రేషన్‌కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటో ఇస్తే చాలు.. వెంటనే జాబ్‌కార్డులు జారీ చేస్తారు. జాబ్‌కార్డు ఉన్న కూలీలు ఐదు కిలోమీటర్ల దూరంలో ఎక్కడైనా ఉపాధి పనులకు హాజరుకావొచ్చు. జాబ్‌కార్డు ఆధారంగా ఉపాధి పనులకు హాజరయ్యే కూలీలకు 15 రోజులకు ఒకసారి వేతనాల చెల్లింపులు జరుగుతాయి.
భద్రాద్రి జిల్లాలో మొత్తం 2.23 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. వీటిలో 4.58 లక్షల మంది కూలీలు నమోదై ఉన్నారు. కానీ, యాక్టివ్ జాబ్‌కార్డులు మాత్రం 1.35 లక్షలు మాత్రమే ఉన్నాయి. వీటి ద్వారా 2.28 లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరవుతున్నారు. వీరిలో 11.62 శాతం ఎస్సీలు, 61.12 శాతం మంది ఎస్టీలు ఉపాధి పనులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ 2.30 లక్షల మంది కూలీలను ఉపాధి హామీ పథకం నుంచి తొలగించే ఆలోచనలో ఉంది. ఇదే జరిగితే కొత్తగా అర్హులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అందని ద్రాక్షే అవుతుంది.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉపాధి హామీ పథకంలో కొత్త జాబ్‌కార్డుల జారీని నిలిపివేశాం. ప్రస్తుతం ఆన్లైన్లో జాబ్‌కార్డు దరఖాస్తులు నమోదు ప్రక్రియ జరగడం లేదు. యాక్టివ్‌గా లేని జాబ్‌కార్డులను తనిఖీ చేసి తొలగించాలని ప్రభుత్వం నుంచి సర్క్యులర్ జారీ అయింది. వాటిని కూడా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటాం.
-రామచంద్రరావు, ఈజీఎస్ ఏపీవో, అశ్వారావుపేట
ఉపాధి హామీ పథకం కింద అర్హులైన కూలీలందరికీ కొత్త జాబ్‌కార్డులు జారీ చేయాలి. అడిగిన కూలీలకు ఉపాధి పనులు చూపాలి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఉపాధి హామీ కూలీలందరికీ సాయం అందించాలి. కొత్త జాబ్‌కార్డులు ఇవ్వకపోవడం సరికాదు. క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన ఉపాధి కూలీలకు రూ.12 వేలు అందించాలి.
-బుడితి చిరంజీవినాయుడు, అశ్వారావుపేట