రఘునాథపాలెం, నవంబర్ 23: ఫ్యాన్సీ నెంబర్లను కోరుకునే కొత్త వాహనదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. ఆదాయ మార్గాల కోసం వెతుక్కుంటున్న సర్కార్ వాహనదారుల అభిరుచిని అవకాశంగా వాడుకుంటోంది. ఫ్యాన్సీ నెంబర్ల ఫీజులను అమాంతం మూడు రెట్లు పెంచేసింది. దీంతో వాహనదారులపై మరింత భారం పడింది. రాష్ట్ర రవాణాశాఖ ‘ఫ్యాన్సీ’ పేరుతో రిజిస్ట్రేషన్ నెంబర్లను విక్రయించే ప్రక్రియను ఎన్నో ఏళ్లుగా కొనసాగిస్తోంది. వాహనాలకు విక్రయించే నెంబర్లలో కొన్నింటిని ఫ్యాన్సీ జాబితాలోకి చేర్చి ఖజానా నింపుకుంటోంది.
కొంతమంది వాహనదారులు న్యూమరాజలజీ ప్రకారం తమ అదృష్ట సంఖ్యను నిర్ణయించుకుంటే.. మరికొందరు సమాజంలో తమ మార్క్ చూపించుకునేందుకు ఈ ఫ్యాన్సీ నెంబర్ల వెంట పరుగులు తీస్తుంటారు. అవసరమైతే వేలంలో పోటీ పడి ఎంత ఖరీదైనా దక్కించుకుంటారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఆ ఫ్యాన్సీ నెంబర్ల ఫీజులను మరింత పెంచి దండుకునేందుకు సిద్ధమైంది. ఇంతకాలం అందుబాటులో ఉన్న ప్రత్యేక నంబర్ల రిజర్వేషన్ ఫీజులను ప్రభుత్వం ఒక్కసారిగా మూడు రెట్లు పెంచింది. ఈ మేరకు జీవో పత్రాలను జిల్లా రవాణాశాఖ అధికారులకు పంపింది. మోటార్ వెహికిల్ రూల్స్- 1989లోని నిబంధన 81ని సవరణ చేస్తూ జీవో నెంబర్ 77ను జారీ చేసింది. అందులో రవాణాశాఖ ప్రత్యేకంగా నిర్ణయించిన ఫ్యాన్సీ నెంబర్లకు కొత్త రేట్లను స్పష్టంగా వెల్లడించింది.
ఇకపై ఫ్యాన్సీ నెంబర్లకు కేవలం ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యాన్సీ నెంబర్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని మరింత పెంచుకునే ఆలోచన చేయడంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. 9999 నెంబరు ధర ఇప్పటివరకు రూ.50 వేలు ఉండగా నూతన జీవో ప్రకారం అది రూ.1.50 లక్షలు అయ్యింది. 1, 9, 6666 నెంబర్ల ఫీజు రూ.లక్షకు పెరిగింది. 99, 999, 3333, 4444, 5555, 7777 నెంబర్లకు రూ.50 వేలుగా చేసింది. 5, 6, 7, 123, 333, 1234, 2727, 3456, 8888 నెంబర్లకు రూ.40 వేలు చేసింది. 3, 111, 234, 5678, 1818, 1999 నెంబర్లకు రూ.30 వేలుగా పెంచింది. 2, 4, 8, 77, 786, 1233, 4567, 4777 వంటి నెంబర్లకు రూ.20 వేలుగా ఫీజు నిర్ణయించింది. ఇతర నంబర్లకు(కార్లు, ఇతర వాహనాలైతే) రూ.6 వేలు, బైకులకు రూ.3 వేలు చేసింది. పెరిగిన ఫీజులతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా సమకూరనుంది.