కొణిజర్ల/ అశ్వాపురం, ఆగస్టు 13: యూరియా బస్తాల కోసం రైతులు పొద్దంతా పడిగాపులు కాస్తూ, నానా అవస్థలు పడ్డారు. ఈ ఘటనలు కొణిజర్ల మండలం గోపవరం, అశ్వాపురం మండలం నెల్లిపాక సొసైటీ కార్యాలయాల వద్ద బుధవారం చోటు చేసుకున్నాయి. గోపవరం సొసైటీకి యూరియా బస్తాలు వచ్చాయనే సమాచారం అందుకున్న వందలాది మంది రైతులు తెల్లవారుజామునే అక్కడికి చేరుకొని క్యూలో నిల్చున్నారు. ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున అధికారులు యూరియా పంపిణీ చేస్తుండగా.. రైతులు ఆందోళన చేస్తారనే ఉద్దేశంతో సొసైటీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని రైతులు సక్రమంగా పంపిణీ అయ్యే విధంగా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తుండడం.. సొసైటీ కార్యాలయం వద్ద సరైన సౌకర్యాలు లేకపోవడంతో రైతులు తడుస్తూనే యూరియా బస్తాలు తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. అలాగే నెల్లిపాక సొసైటీకి బుధవారం లోడు వస్తుందనే విషయం తెలుసుకున్న రైతులు ఉదయమే అక్కడికి చేరుకొని పొద్దంతా నిరీక్షించారు. అయితే ఒక్క రైతుకు కేవలం రెండు బస్తాల యూరియా ఇస్తామని సొసైటీ అధికారులు చెప్పడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఎక్కువ బస్తాలు ఇవ్వకపోవడంతో చివరకు రెండు కట్టలు తీసుకొని వెళ్లారు.