అశ్వారావుపేట, అక్టోబర్ 8 : స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించకుండా నాన్చుడు ధోరణి అవలంబించిన రాష్ట్ర సర్కార్ ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.. కానీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిధులను విడుదల చేయకుండా సమస్యను తెచ్చిపెట్టింది. ఇప్పటికే గడిచిన ఏడాదిన్నర కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక పైసా నిధులు మంజూరుకాక అటు మండల పరిషత్, ఇటు గ్రామ పంచాయతీల బ్యాంక్ ఖాతాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
ఒకవైపు ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.. అన్నీ అనుకూలిస్తే గురువారం నోటిఫికేషన్ విడుదలకానుంది. ఈ నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డుసభ్యుల ఎన్నికలు నిర్వహించటం ఎలా అని అధికారులు సందిగ్ధంలో పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 22 జడ్పీటీసీలు, 223 ఎంపీటీసీలు, 471 సర్పంచులు, 4,168 వార్డుసభ్యుల ఎన్నిక కోసం సర్వం సిద్ధమైంది. ఇందుకోసం 4,242 పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వం నుంచి ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేక నిధులు ఇంకా విడుదలకాకపోవడంతో అధికారులు దిక్కులు చూస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక గ్రాంట్‌ను ఇంకా విడుదల చేయలేదు. ఎన్నికల ఏర్పాట్లు మాత్రం అధికారుల ద్వారా పరుగులు పెట్టిస్తున్నది. ఇప్పటికే గత కొంతకాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మంజూరుకావాల్సిన నిధులు అందక అధికారులు అప్పులు చేస్తున్నారు. ఏడాదికాలంగా చేసిన అప్పులు తడిసి మోపెడు కాగా.. ఇప్పుడు స్థానిక ఎన్నికల నిర్వహణ మరింత ఆర్థిక భారమవుతున్నది. ఖర్చులకు డబ్బులు ఎలా అంటూ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితా తయారీ నుంచి ఎన్నికల సామగ్రి, ఇతర రవాణా ఖర్చులు మోయలేనంతగా భారమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే నిధులు లేకుండా ఎలా ముందుకు వెళ్లాలని తలలు పట్టుకుంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం జనాభా ప్రాతిపదికన ఒక్కో మండలానికి సుమారు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చుకానున్నది. జిల్లావ్యాప్తంగా 22 మండలాల్లో 22 జడ్పీటీసీలు, 223 ఎంపీటీసీలు, 471 సర్పంచ్‌లు, 4,168 వార్డు సభ్యులకు ఎన్నిక జరగనుంది. రెండు దశల్లో జరగనున్న ఎన్నికలకు ఖర్చు మాత్రం తప్పదు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9వ తేదీ గురువారం నోటిఫికేషన్ కూడా విడుదలకానుంది. ఎన్నికల సామగ్రిని ఎన్నికల సంఘం సమకూర్చినా ఇతర స్టేషనరీ, ఎన్నికల సామగ్రి, రవాణా, సమావేశాలు, బ్యానర్లు, హమాలీ ఖర్చులు, ఎన్నికల సిబ్బందికి భోజన, వసతి సౌకర్యాలు కల్పించటం కోసం నిధుల కొరత అధికారులను వేధిస్తున్నది. ఎన్నికలకు ముందస్తు పెట్టుబడి పెట్టాల్సిన దుస్థితి నెలకొంది.
గత ఏడాది ఫిబ్రవరి నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పాలన సాగుతోంది. ఇదే తరహాలో ఆగస్టు నుంచి మండల, జిల్లా పరిషత్‌ల్లోనూ స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మంజూరుకావాల్సిన ఆర్థిక సంఘం నిధులు సక్రమంగా అందటం లేదు. దీంతో ప్రత్యేకాధికారులకు ఆర్థిక ఇబ్బందులు తప్పటం లేదు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం గ్రామ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు సొంత డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. మరీ ఎక్కువ అయితే అప్పు తెచ్చుకోవాల్సిందే. నోటిఫికేషన్ విడుదలతోపాటు ప్రత్యేక గ్రాంట్‌ను మంజూరు చేయాలని అధికారులు సర్కార్‌ను వేడుకుంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా విడుదల కాలేదు. ఇప్పటికే ప్రతిపాదనలను పంపించాము. ప్రభుత్వం బడ్జెట్‌ను కేటాయించినట్లు తెలిసింది. జిల్లాలకు కేటాయించిన నిధులను మండలాల వారీగా అందిస్తాము. మరికొద్ది రోజుల్లోనే గ్రాంట్ మంజూరుకావొచ్చు.
– బొగ్గుల నాగలక్ష్మి, జడ్పీ సీఈవో, భద్రాద్రి కొత్తగూడెం