తిరుమలాయపాలెం, మార్చి 16: పల్లెల్లో పచ్చదనం మాయమైపోయింది. నర్సరీల నిర్వహణపై ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈజీఎస్ ఆధ్వర్యంలో పలు గ్రామ పంచాయతీల్లో చేపట్టిన నర్సరీల్లో మొక్కలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. వచ్చే వానకాలానికి మొక్కలు పెంచాల్సిన నర్సరీలు బీళ్లుగా మారిపోయి రూపురేఖలే లేకుండా ఉన్నాయి. తిరుమలాయపాలెం మండలంలోని జోగులపాడులో హరితహారం మొక్కలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. జల్లేపల్లి నర్సరీ వద్ద అదే దుస్థితి. మేకలతండాలో మొక్కలు పెంచాల్సిన నర్సరీ బీడుగా మారింది.
చంద్రుతండా, గోల్తండా, తిప్పారెడ్డిగూడెం, పాతర్లపాడు, హైదర్సాయిపేట, ఇస్లావత్తండాల్లోనూ నర్సరీల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఆయా గ్రామాల్లోని స్థితిగతులను బట్టి మొక్కల పెంపకంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో స్పష్టమవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వానకాలం సీజన్లో మొక్కల పెంపకంపై దృష్టి పెట్టకపోవడంతో నిధుల దుర్వినియోగంతోపాటు పల్లెల్లో పచ్చదనం కనుమరుగైందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో పల్లెల్లో పచ్చదనాన్ని పెంపొందించి కాలుష్యాన్ని నివారించే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని అమలుచేసిన విషయం విదితమే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచి విస్తృతంగా వరుసగా ఆరేళ్లపాటు మొక్కల పెంపకం చేపట్టింది.
గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలను నిర్మించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన హరితహారం ప్రోగ్రాన్ని అపహాస్యం చేస్తున్నది. పల్లెల్లో నర్సరీలు, పల్లెప్రకృతి వనాలు కళ తప్పాయి. ఈ ఏడాది కూడ 40గ్రామాల్లో రూ.40 లక్షల వ్యయంతో 1.60 లక్షల మొక్కల పెంపకం చేపట్టినట్లు ఇప్పటికే నర్సరీల్లో మొక్కల పెంపకం మొదలైనట్లు ఈజీఎస్ ఏపీవో నర్సింహారావు తెలిపారు. కానీ గ్రామాల్లో పరిశీలిస్తే పలు ప్రాంతాల్లో నర్సరీలు ఇప్పటికీ బీళ్లు పిచ్చిచెట్లు, పొదలతో దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిసారింది నర్సరీల్లో సవ్యంగా మొక్కల పెంకం చేపట్టి వచ్చే వానకాలం సీజన్లో మొక్కలు నాటాలని ప్రజలు కోరుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రకృతి వనాలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.