ఖమ్మం సిటీ, జూన్ 23 : పెండింగ్ వేతనాలపై ప్రభుత్వం ఎంతకూ స్పందించకపోవడంతో విసుగుచెందిన కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు సీఐటీయూ సహకారంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రభుత్వానికి, స్థానిక యంత్రాంగానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో దవాఖాన ఆర్ఎంవో వినాయక్ రాథోడ్ వారి వద్దకు వచ్చి సమ్మె విరమించాలని కోరారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకుడు వై.విక్రం మాట్లాడుతూ కార్మికులకు నిలిచిపోయిన నాలుగు నెలల వేతనాలు ఇప్పించి ఆదుకోవాలని కోరారు.
సర్కారు స్పందించకపోతే మంగళవారం నుంచి ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఆ మరుసటి రోజు బుధవారం జిల్లాలోని వివిధ పార్టీలు, కార్మిక సంఘాల మద్దతుతో ఖమ్మం ఎమ్మెల్యే, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఐద్వా జిల్లా కార్యదర్శి బండి పద్మ, అధ్యక్షురాలు మెరుగు రమ, మాచర్ల భారతి, అమరావతి కార్మికుల దీక్షకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో పెద్దాసుపత్రి కార్మిక నాయకులు అంబేద్కర్, మాతంగి అనిల్‌కుమార్, జగదీశ్, అశోక్, వెంకటరమణ, విజయమ్మ, రాములమ్మ, సత్యవతి, మమత, అంజలి, ఉపేందర్, ఉమా, మాధవి, మల్లిక, స్వరూప, సరళ, వసంత పాల్గొన్నారు.