‘మేం అధికారంలోకి రాగానే ఆసరా పింఛన్ రూ.2 వేలకు బదులు రూ.4 వేలు, దివ్యాంగుల పింఛన్ రూ.4 వేలకు బదులు రూ.6 వేలు ఇస్తాం.. ఎంతమంది ఉంటే అంతమందికి కొత్త పింఛన్లు ఇస్తాం. ఇంకా అదిస్తాం.. ఇదిస్తాం.. ఏదేదో చేస్తాం..’ అంటూ అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ నాయకులు పిట్టలదొర చెప్పినట్లు మాటలు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడిచింది.
కొత్త పింఛన్ల మాట దేవుడెరుగు.. పాత పింఛన్లు ఇవ్వడానికే కాంగ్రెస్ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నది. గత కేసీఆర్ ప్రభుత్వం పేదలపై ప్రేమతో పెంచి ఇచ్చిన ఆ పింఛన్లు ఇచ్చేందుకే పిల్లిమొగ్గలు వేస్తున్నది. పైగా ప్రజలతో దరఖాస్తుల మీద దరఖాస్తులు పెట్టించి కొత్త పింఛన్ల ఊసే ఎత్తకుండా నిమ్మకునీరెత్తినట్లు గమ్మున ఉండిపోయింది. నోటికొచ్చిన హామీలిచ్చి నెరవేర్చకుండా పబ్బం గడుపుతున్న కాంగ్రెస్ సర్కార్ తీరుపై ప్రజలు చిర్రెత్తిపోతున్నారు.
– భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ)
పింఛన్ లబ్ధిదారులకు కాంగ్రెస్ సర్కార్ చుక్కలు చూపెడుతున్నది. దీంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఆసరా పేరుతో ఓట్లకు గాలం వేసిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక ప్లేటు ఫిరాయించింది. ఏడాది దాటినా కొత్త పింఛన్ల జాడ కనబడటం లేదు. అప్పుడు ఆరు గ్యారెంటీలు, మొన్నటికి మొన్న నాలుగు గ్యారెంటీలు అన్న సర్కారు ఏ గ్యారెంటీకి గ్యారెంటీ లేకుండా చేసింది. దీంతో ప్రజాపాలనలో పింఛను కోసం దరఖాస్తు పెట్టుకున్న లబ్ధిదారుల ఆశలు అడియాశలయ్యాయి.
ప్రజాపాలన అంటే ఇలా ఉంటుందా అని ఇప్పుడు లెంపలేసుకోవాల్సి వస్తున్నదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా గత ఏడాది 45,332 మంది పింఛను కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు లెక్కలు చూపెడుతున్నారు. కానీ పాత లెక్కల ప్రకారమే పాత పింఛనుదారులకు అప్పటి బీఆర్ఎస్ సర్కారు ఇచ్చినంత పింఛను మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.
కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోతున్నాయి. ఎన్నికల హామీల్లో భాగంగా ఆసరా పింఛనుదారులకు పింఛను పెంచుతాం అని గప్పాలు కొట్టిన హస్తం పార్టీ ఇప్పుడు అమలు సాధ్యంకాక చతికిలపడింది. గత రెండునెలలుగా పింఛన్ బకాయిలు ఇవ్వలేక ఇప్పటికీ జనవరి నెల పింఛన్ మాత్రమే ఇచ్చారు. ప్రతి నెల పింఛన్ లబ్ధిదారులు బ్యాంకుల వద్దకు వెళ్లి పడిగాపులు కాసినా ఇంకాపడలేదనే సమాధానం వినవల్సి వస్తున్నది. అధికారంలోకి రాగానే పాత పింఛన్ల స్థానంలో కొత్త పింఛన్లు ఇస్తామని వృద్ధులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు అని గొప్పలు చెప్పుకొని చివరికి పాత పింఛనే ఇవ్వాల్సి వస్తున్నది. ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకున్న ఒక్కరికీ కూడా పింఛను ఇవ్వకపోవడం గమనార్హం.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే ప్రజాపాలన గ్రామసభలను అట్టహాసంగా ఏర్పాటు చేసింది. ప్రతి గ్రామపరిధిలో సభలను ఏర్పాటు చేసి లబ్ధిదారుల వద్ద దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో రేషన్‌కార్డులు, ఉచిత విద్యుత్, గ్యాస్, రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ, ఆత్మీయభరోసా, ఆసరా పింఛన్లు, మహాలక్ష్మి వంటి పథకాలకు దరఖాస్తులు తీసుకున్నారు. కానీ అవి పైలట్ గ్రామాలకే పరిమితం చేసి చేతులు దులుపుకున్నారు. ఆ పైలట్ గ్రామాల్లో కూడా సక్రమంగా పథకాలు అమలు చేయలేకపోవడంతో లబ్ధిదారులు తిరుగుబావుటా ఎగురువేస్తున్నారు. అధికారులను ఆయా గ్రామాల్లో నిలదీస్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పింఛన్లే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,16,999 మందికి రూ.26,49,91 కోట్ల నగదును పింఛన్లుగా ఇస్తున్నారు. ఇవన్నీ గత ప్రభుత్వం మంజూరు చేసినవే. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఎంతకాలం ఎదరుచూపులు అని తిట్టిపోస్తున్నారు. జిల్లాలో 45,332 మంది కొత్త పింఛన్ల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు.
కొత్త పింఛను వస్తది అనుకున్నా.. కానీ పాత పింఛనే వచ్చింది. మార్చి నెలలో పింఛను రాలేదు. ఈ నెల మూడో తారీఖున పింఛను పడింది. కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోమన్నరు. ఎప్పుడు వస్తదో గ్యారెంటీ లేదు. దీని మీదే బతుకుతున్నాను. మందుల డబ్బులకు కూడా సరిపోవడంలేదు. ఖర్చులు బాగా పెరిగిపోయాయి.
– బాలు, రుద్రంపూర్తండా, చుంచుపల్లి మండలం
అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన పింఛనే ఇస్తున్నారు. కొత్త పింఛను ఇస్తామని చెప్పారు. పింఛను లేదు.. పాడూలేదు. కొత్త పింఛను అంటే ఆశపడ్డాను. ఖర్చులకు వస్తయి అనుకున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అయ్యింది. అయినా పింఛను పెంచలేదు.. కొత్తవాళ్లకి ఇచ్చింది లేదు.
– సుభద్ర, త్రీఇైంక్లెన్, చుంచుపల్లి మండలం
పింఛను కోసం బ్యాంకు చుట్టు తిరగడానికే డబ్బులు సరిపోతున్నాయి. ఎప్పుడు పింఛను పెంచుతారో తెలియదు.. వెంటనే పెంచాలి. కానీ బ్యాంకుకు వచ్చి చూసుకోవాల్సి వస్తున్నది. జనవరి నెలలో ఇవ్వాల్సిన పింఛన్ ఏప్రిల్‌లో ఇచ్చారు. పోయిన నెలంతా తిరిగాము. పింఛను పడలేదు. ఎండకు పనులకు కూడా వెళ్లలేకపోతున్నాం.
– సుజన, రుద్రంపూర్, చుంచుపల్లి మండలం
కొత్త పింఛన్లు ఇవ్వమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. వస్తే పెరిగిన ఆసరా పింఛన్లు బ్యాంకు ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయి. ప్రస్తుతానికి పాత పింఛన్లు ఇస్తున్నాము. ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న వారికి తప్పక పింఛన్లు వస్తాయి.
– విద్యాచందన, అదనపు కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం