భద్రాద్రి కొత్తగూడెం, మే 18 (నమస్తే తెలంగాణ) : ‘రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటాం’ అంటూ గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్షకులు తమ కల్లాల్లో ఆరబోసిన ధాన్యపు రాసులు కనబడడం లేదు. వారాలు గడుస్తున్నా కల్లాల్లోని ధాన్యం అంగుళం కూడా కదలడం లేదు. కొనుగోలు కేంద్రాలకు తాము పంటను తెచ్చి 20 రోజులు గడుస్తున్నా కొనుగోలు చేసిన నాథుడే లేడు. నిర్ణీత శాతానికి తేమ వచ్చే వరకూ ఎండబెట్టి తీసుకురావాలంటూ అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తేల్చిచెబుతున్నారు. దీంతో అన్నదాతలు అక్కడే ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. దానిని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. గాలిదుమారాలు, అకాల వర్షాలు ఎప్పుడొచ్చి పడతాయోనని అనుక్షణం ఆందోళన చెందుతున్నారు.
ఒకవేళ వర్షమొచ్చి ధాన్యం తడిస్తే తమ పరిస్థితి ఏమిటంటూ గుండెల్లో భారంతో గడుపుతున్నారు. మబ్బులుపట్టి చినుకులు పడినా, లేదంటే గాలిదుమారంతో కూడిన భారీ వర్షం కురిసినా.. తడవకుండా తమ ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. దీనికితోడు.. తారం (తరుగు) కోతలు, మిల్లర్ల దోపిడీలు అన్నదాతల నడ్డివిరుస్తున్నాయి. ఇక, భద్రాద్రి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో ప్రభుత్వ వేగం నత్తను తలపిస్తోంది. నిర్ణీత లక్ష్యంలో ఇప్పటివరకూ 17 వేల మెట్రిక్ టన్నులను మాత్రమే కొనుగోలు చేసిన రేవంత్ ప్రభుత్వం.. ఇంకా 97 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంది. మరో పది, పదిహేను రోజుల్లో వానకాలం సీజన్ కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్నదాతల కష్టాలు అరణ్య రోదనలే అవుతున్నాయి.
చెమటోడ్చి పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు అమ్ముకుందామనుకున్న అన్నదాతలు అన్నివైపుల నుంచీ దోపిడీకి గురవుతున్నారు. కష్టించి పండించిన ధాన్యాన్ని వ్యయప్రయాసలకోర్చి కొనుగోలు కేంద్రాలకు తెచ్చుకుంటున్నారు. నిత్యం అక్కడే కాపలా ఉంటూ ఆ ధాన్యాన్ని మంచి ఎండలో ఎండబెడుతున్నారు. నిర్ణీత తేమ శాతం వచ్చే వరకు ఎన్ని రోజులైనా అక్కడే ఉంటూ ఎదురుచూస్తున్నారు. రోజులు, వారాల నిరీక్షణ అనంతరం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కనికరించి కరుణిస్తే.. ఆ ధాన్యాన్ని తీసుకెళ్లి యంత్రంలో పోస్తున్నారు. అక్కడే అసలు దోపిడీలు మొదలవుతున్నాయి. ఇంకా పూర్తిస్థాయి తేమ రాలేదంటూ కొన్నిసార్లు, తేమ శాతం సరిగా లేనందున అధిక తారం తీయాలంటూ.. మరికొన్నిసార్లు, అన్నీ సరిగానే ఉన్నా.. మిల్లర్ల ఆదేశం ప్రకారం తరుగు తీయాల్సిందేనంటూ ఇంకొన్నిసార్లు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు చుక్కలు చూపిస్తున్నారు.
భద్రాద్రి జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. చుంచుపల్లి మండలంలో ఇటీవల వెలుగుచూసిన ఇలాంటి విషయమే ఇటీవల జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా, సుజాతనగర్ కొనుగోలు కేంద్రంతోపాటు కొత్త అంజనాపురం, పెనగడప కొనుగోలు కేంద్రాల్లోనూ ఇలాంటి విషయాలు మళ్లీ వెలుగుచూశాయి. ‘తరుగు ఇస్తేనే కొంటాం.’ అంటూ మిల్లర్లు తెగేసి చెబుతుండడంతో అవే మాటలను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు చెబుతున్నారు. కొన్నిసార్లు అధికారులే రైతులకు సర్దిచెప్పి కాంటాలు పూర్తిచేస్తున్నారు. మరికొందరు రైతులైతే.. చేసేదేమీ లేక మిన్నకుండిపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయట తక్కువ ధరకు, లేదంటే మిల్లర్లకు ఎక్కువ తరుగుకు తెగనమ్ముకుంటున్నారు.
రైతులు కష్టపడి పండించిన పంటలపై రైస్ మిల్లర్లు కన్నేస్తున్నారు. ‘ఎంత కష్టపడి ఎంత పంట పండించారన్నది ముఖ్యం కాదు.. ఎంత తారం ఇస్తున్నారన్నదే ముఖ్యం’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నాణ్యమైన ధాన్యం తెచ్చినా మిల్లర్లు నిర్దయగా అధిక మొత్తం తరుగు తీస్తున్నారు. అన్నదాతల శ్రమను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఇదంతా ప్రభుత్వానికి తెలిసినా చర్యలు శూన్యమవుతున్నాయి. దీంతో ప్రభుత్వమే పరోక్షంగా మిల్లర్లకు సహకరించినట్లవుతోంది.
భద్రాద్రి జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు అధికారికంగా 17,120 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేశారు. ఇంకా 97 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రావాల్సి ఉంది. ఇటీవల కొన్ని రోజులు అకాల వర్షాలు కురవడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఇటీవల మళ్లీ మొదలైనా.. రైతుల నుంచి ఇంకా ధాన్యం వస్తోంది. దీనికితోడు కాంటాలు ఆలస్యం కావడం, రవాణా సమస్య ఉత్పన్నం కావడం, హమాలీల కొరత ఉండడం వంటివన్నీ తోడవుతున్నాయి. ఇదంతా ఇలా ఉంటే.. ఎప్పుడు ఏ క్షణాన అకాల వర్షాలు కురుస్తాయోనంటూ కర్షకులు తమ కంటిమీద కునుకు లేకుండా కాచుకొని కూర్చుంటున్నారు.
అకాల వర్షాల వల్ల ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమయ్యాయి. జిల్లాలో తరుగు తీస్తున్న ఘటనలు అసలు ఎక్కడా లేవు. కొంతమంది వ్యక్తులు ఉద్దేశ పూర్వకంగానే ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారు. సరైన తేమ శాతం ఉండి, తాలు తీస్తే ఒక్క గింజ కూడా తరుగు ఉండదు. ఎవరన్నా తారం తీస్తున్నట్లు రైతులు గమనిస్తే మా దృష్టికి తీసుకురావాలి. వెంటనే విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. కలెక్టర్ కూడా చాలా కేంద్రాలను తనిఖీలు చేశారు. ప్రతి రోజూ పర్యవేక్షిస్తున్నాం.
-త్రినాథ్బాబు, సివిల్ సప్లయీస్ జిల్లా అధికారి
మాది చిమ్నాతండా. మా ధాన్యాన్ని ఇక్కడికి తెచ్చి 20 రోజులవుతోంది. ఇంతవరకు కొనలేదు. ఏంటని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను అడిగితే.. తేమ శాతం ఇంకా రాలేదన్నారు. ఇంకా రోజులు, వారాల తరబడి కాపలా ఉండాలంటే భయంగా ఉంటోంది. వర్షం వస్తుందేమోనని ఆందోళనగా ఉంటోంది. ధాన్యం తడిస్తే మేం మరింత నష్టపోతాం. అదీగాక, తరుగు ఇస్తేనే కాంటా పెడతామన్నారు. ఇస్తామని చెప్పినా ఇంకా పెట్టడం లేదు.
-బోడా పార్వతి, చిమ్నాతండా, సుజాతనగర్
కల్లాలు, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు కూడా వెంటనే తీసుకెళ్లడం లేదు. అందువల్ల కొనుగోలు కేంద్రాల్లో రాసులు పేరుకుపోతున్నాయి. కొనాలంటూ నిర్వాహకులను కోరితే.. సరైన తేమ లేదని సమాధానం చెబుతున్నారు. ఈ సాకుతో రోజులతరబడి కొనుగోలు కేంద్రాల వద్దనే ఉండాల్సి వస్తోంది. తరుగు తీయడం లేదని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి వేరేలా ఉంది. తరుగు తీయనిదే కాంటాలు వేయడం లేదు. ఇలాంటి కష్టం రెండేళ్ల నుంచి చూస్తున్నాం.
-భూపతి రమేశ్, రావికంపాడు, చండ్రుగొండ