అశ్వారావుపేట, మే 1 : పెరిగిన పంట పెట్టుబడిని సైతం భుజాన వేసుకుని సాగు కష్టాలు ఎదుర్కొన్న రైతున్న.. దిగుబడి తీసుకొనేటప్పటికే అలసిపోతున్నాడు. తీరా పండించిన పంటను అమ్ముకోవడానికి ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడంతో దిక్కులు చూస్తున్నాడు. దళారులకు అమ్ముకుని నష్టపోలేక ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నాడు. రోజులు గడిచిపోతున్నా ప్రభుత్వం ధాన్యం కొనకపోవడంతో నిరాశ చెందుతున్నాడు. ఇన్ని సమస్యలను మోయలేకపోతున్న దశలో రైతుపై ప్రకృతి కూడా కనికరం చూపడం లేదు. ఏదో సమయంలో వర్షం రూపంలో పంట నాణ్యతను దెబ్బతీస్తోంది. ఇంకేముంది.. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందుకోలేక కుదేలవుతున్నాడు.
ఈ యాసంగి పంట చేతికంది 20 రోజులు దాటుతున్నా.. ప్రభుత్వం మాత్రం ఒక్క గింజను కూడా కొనుగోలు చేయలేదు. తాలు పేరుతో జాప్యం చేస్తున్నారు. ఇంతలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో కుంగిపోయారు. కల్లాల్లో పోసిన ధాన్యం రాసులను పరదాలు కప్పి భద్రపరుచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, వాతావరణ ప్రభావంతో దయనీయ స్థితికి చేరుకుంటున్నాడు. కల్లాల్లో నిల్వ చేసిన ధాన్యం రాసులను చూస్తున్న రైతుల కళ్లల్లో దైన్యం కన్పిస్తోంది.
భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 78,294 ఎకరాల్లో యాసంగి వరి సాగైంది. సుమారు 1,93,674 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా ఒక పక్క ఆకాశం మేఘావృతమై మబ్బులు కమ్ముకున్నాయి. మరోపక్క కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు పేరుకుపోయాయి. ఎప్పుడు వర్షాలు కురుస్తాయో అంతుపట్టక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రచార ఆర్భాటం కోసం ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. కానీ, ఒక్క గింజను కూడా కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తోంది. మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోవడానికి అనేక కొర్రీలు పెడుతుండడంతో అధికారులు ధాన్యం సేకరణలో చేతులు ఎత్తేశారు.
మిల్లర్లను ఒప్పించే పనిలో నిమగ్నమయ్యారు. నాలుగు రోజులుగా వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతో రైతులు దిగాలు చెందుతున్నారు. వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ కూడా హెచ్చరించడంతో రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడం, అధికారులు సహకరించకపోవడం వంటి కారణాలతో కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి సిద్ధం చేసిన ధాన్యం రాసులను చూసి కర్షకులందరూ తమ కన్నీళ్లను దిగమింగుకుంటున్నారు. క్షణ క్షణం ధాన్యం రాసులను చూస్తూ మనోవేదనకు గురవుతున్నారు. వర్షాల నుంచి రక్షణకు పరదాలు కప్పుకుంటూ ధాన్యం రాసులను భద్రపరుచుకుంటున్నారు. 20 రోజులకు పైగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ చేసినా కొనే దిక్కులేక బిక్కుబిక్కుమంటున్నారు. వర్షం పడినా భారమంతా దేవుడిపైనే వేసి కాలం వెళ్లదీస్తున్నారు.
ఈ యాసంగిలో ధాన్యం దిగుబడులు భారీగా వచ్చాయి. మొత్తం 23 మండలాల్లో రైతులు 78,294 ఎకరాల్లో సాగు చేశారు. ఇందులో విత్తన ఉత్పత్తి కోసం 5,739, సన్నాలు 48,855, దొడ్డు రకం 23,700 ఎకరాల్లో ధాన్యం పండించారు. సన్నాలు ఎకరాకు 2.8 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 3 మెట్రిక్ టన్నులు దిగుబడి రావొచ్చని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఈ లెక్కన మొత్తం సాగు విస్తీర్ణం ద్వారా 2,07,894 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, ఇందులో సన్నాలకు రూ.500 చొప్పున బోనస్ కోసం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు విక్రయిస్తారని,
దొడ్డు రకం బయట మార్కెట్కు 20 శాతం పోయినా.. 80 శాతం రావొచ్చని లెక్కలు కట్టారు. సన్నాలు 48,855 ఎకరాల్లో పండించగా.. 1,36,794 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 23,700 ఎకరాల్లో పండించగా.. 71,100 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని, ఇందులో దొడ్డు రకం 20 శాతం బయట మార్కెట్కు పోయినా మిగతా 80 శాతం అంటే.. 1,93,674 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే రైతులు తీసుకొస్తారని భావించారు. అందుకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతుల సహనాన్ని పరీక్షిస్తోంది.
పంట చేతికి అంది 20 రోజులు దాటింది. అధికారుల సూచన మేరకు ధాన్యం తూర్పార బట్టి సిద్ధం చేశాను. అయినా ఇంత వరకు ఒక్క గింజ కూడా కొనలేదు. మిల్లర్ల కోసం తరుగు అడుగుతున్నారు. ఎప్పుడు వర్షం వస్తుందోనన్న ఆందోళన కలుగుతోంది. ఇప్పటికే వాతావరణ శాఖ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది.
-తోట బంగారయ్య, రైతు, అశ్వారావుపేట
కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చాను. రోజుల తరబడి కేంద్రాల చుట్టూ తిరుగుతున్నాను. కానీ, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అధికారులు వారం క్రితం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి వెళ్లిపోయారు. ధాన్యం కొననప్పుడు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేశారు? కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రచారం తప్ప పాలన రావడం లేదు. ఇప్పటికే కొన్ని మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
-పలగాని మారేశ్వరరావు, రైతు, అన్నపురెడ్డిపల్లి
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మొదలు పెడుతున్నాం. పంట దిగుబడికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. ధాన్యం సేకరణలో ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిని ఏఈవోల ద్వారా తనిఖీ చేయిస్తున్నాం. గత యాసంగి కన్నా ఈ ఏడాది ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగైంది. 1,93,674 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అంచనా ఉంది.
-శ్రీనివాసరావు, డీసీవో, కొత్తగూడెం