ఇల్లెందు, నవంబర్ 13: అధికార పార్టీకి చెందిన ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు కోపమొచ్చింది. చెరువుల్లో వదలాల్సిన చేపపిల్లల సైజును చూసి మత్స్య శాఖ అధికారి ఇంతియాజ్ అహ్మద్ ఖాన్‌పై మండిపడిన ఘటన గురువారం చోటు చేసుకుంది. ఇల్లెందు మండలంలోని 25 చెరువులకు సరఫరా చేయడానికి 3.50 లక్షల చేపపిల్లలను మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోకి వాహనాల్లో తీసుకొచ్చారు. వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే కనకయ్య తక్కువ పరిమాణంలో ఉన్న వాటికి ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. వాటిని తీసుకెళ్లి పెద్ద సైజులో ఉన్న వాటిని పంపిణీ చేయాలని సూచించారు.
ఈ క్రమంలో చిన్న సైజులో ఉన్న చేపపిల్లలను చెరువుల్లో వదిలితే పెద్ద చేపలు తింటాయని మత్స్య సహకార సంఘాల సభ్యులు, రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే ఆయన మత్స్యశాఖ అధికారులు, సిబ్బందిని, చేపపిల్లలు పంపిణీ చేసిన కాంట్రాక్టర్‌కు పిలిచి తీవ్రస్థాయిలో మందలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏటా పంపిణీ చేసే విధంగా 30-40 మి.మీ పరిమాణం గల చేపపిల్లలను సొసైటీలకు సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం మత్స్య సహకార సంఘాల నాయకులు, రైతులు మాట్లాడుతూ ఇటీవల తమను ఏపీ రాష్ట్రం కైకలూరు, మహబూబాబాద్ ప్రాంతంలో ఉన్న చేపపిల్లల కేంద్రాల వద్దకు తీసుకెళ్లి పిల్లల సైజు చూపించారని, అప్పుడు పెద్దగానే ఉన్నాయని, ఇప్పుడు తీసుకొచ్చిన పిల్లలు మాత్రం చిన్నగా ఉన్నాయని తెలిపారు.
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపపిల్లల పంపిణీ జూలై, ఆగస్టు నెలల్లోనే పూర్తి చేసేవారని, కానీ, ఇప్పుడు నవంబర్ నెలలో చేపపిల్లలు చెరువుల్లో వదిలితే ఎలా అని ప్రశ్నించారు. చిన్నపిల్లలు చెరువుల్లో వదలడం వల్ల వాటిని పెద్ద చేపలు తినే ప్రమాదం ఉన్నదని, వాటిని నీటిలో వదిలినా ఉపయోగం లేదన్నారు. దీనిపై జిల్లా మత్స్య శాఖ అధికారి ఇంతియాజ్ అహ్మద్ ఖాన్‌ను వివరణ కోరగా.. ఈ ఏడాది టెండర్ల ప్రక్రియ కొంత ఆలస్యమైందని, తీసుకొచ్చిన చేపపిల్లల్లో ఎక్కువ శాతం నిబంధనల ప్రకారం కాకుండా తక్కువ సైజులో ఉన్నాయని తెలిపారు. పెద్ద సైజు చేపపిల్లలు తీసుకురావాలని కాంట్రాక్టర్‌కు సూచించి వెనక్కి పంపించామని వివరించారు.