అశ్వారావుపేట, నవంబర్ 14 : అన్నదాతల కోసం అన్నీ చేస్తున్నట్లు కపట ప్రేమలు ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆఖరికి అదే అన్నదాతలకు వెన్నుపోటు పొడిచేందుకు వెనుకాడని ఉద్దేశం కన్పిస్తోంది. వ్యవసాయానుబంధ సొసైటీల మంగళానికి కుట్రలు పన్నుతుండడమే ఇందుకు కారణంగా నిలుస్తోంది. గడిచిన పదేళ్ల పాలనలో వ్యవసాయాభివృద్ధికి, రైతు సంక్షేమానికి అప్పటి కేసీఆర్ సర్కారు అగ్రతాంబూలం వేస్తే.. అదే వ్యవసాయ అనుబంధ రంగాలను నిర్వీర్యం చేసేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. వ్యవసాయ అనుబంధ సంఘాలను మరింత బలోపేతం చేసి అన్నదాతలకు వెన్నుదన్నుగా ఉంచాల్సింది పోయి..
నిర్వహణ భారాల పేరిట నిలువునా చీల్చేందుకు, ఇతర సంఘాల్లో కలిపేందుకు సమాలోచనలు చేస్తోంది. నిర్వహణ భారాలు, నష్టాలు, అప్పులు, ఉద్యోగాల వేతనాలు తదితర కారణాలను చూపించి సాగు అనుబంధ సంఘాలను మొత్తానికి మూసివేసే కుట్రలకూ తెరతీస్తోంది. తాజాగా డీసీఎంఎస్‌లపై కన్నువేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. నిర్వహణ భారం పేరిట వాటిని నట్టేట ముంచేందుకు, అన్నదాతలకు వాటి సేవలను దూరం చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. డీసీఎంఎస్‌ల ఆస్తులు, అప్పులు, పెండింగ్ వేతనాలు వంటి వివరాలను పంపాలంటూ ఆ శాఖ అధికారులకు ప్రభుత్వం చేసిన ఆదేశాలే ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.
ఇన్నాళ్లూ అన్నదాతలకు ఎరువులు, విత్తనాలు అందిస్తూ; కర్షకుల నుంచి ధాన్యాన్ని, పంటలను సేకరిస్తూ.. వ్యవసాయ శాఖకు అనుబంధంగా కొనసాగుతున్న జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)ల నిర్వహణను కాంగ్రెస్ ప్రభుత్వం భారంగా భావిస్తోంది. రెండేళ్లుగా వీటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో ఎరువులు, విత్తనాల విక్రయాలు కూడా నిలిచిపోయాయి. ఇప్పటికే ఉద్యోగుల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో డీసీఎంఎస్‌లను వదిలించుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచనలు కూడా చేసినట్లు సమాచారం.
ఒకవేళ అలాకాకుంటే వేరే కార్పొరేషన్లో విలీనం చేయడమో, లేక.. రద్దుచేయడమో అనే అంశాలనూ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యల నేపథ్యంలో ఖమ్మం డీసీఎంఎస్ వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. దీని ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల వేతనాలు తదితర అంశాలతో కూడిన నివేదికను అందించాలంటూ ఆ శాఖ జిల్లా అధికారులకు ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వ ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాయి. ఒకవేళ ఖమ్మం డీసీఎంఎస్‌ను మరో కార్పొరేషన్లో విలీనం చేయడమో, లేక రద్దుచేయడమే జరిగితే.. దానికి ఉన్న సుమారు రూ.100 కోట్ల ఆస్తుల సంగతి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. దీంతో రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు విత్తనాలను, ఎరువులను సరఫరా చేయడంతోపాటు వారి నుంచి ధాన్యాన్ని, పంటలను కొనుగోలు చేసే ఉద్దేశంతో 1960లో అప్పటి ప్రభుత్వం డీసీఎంఎస్‌లను ఏర్పాటు చేసింది. ఇందులో ఖమ్మం డీసీఎంఎస్ కూడా ఒకటి. అయితే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ డీసీఎంఎస్‌ల ద్వారా పరపతేతర వ్యాపారాలు నిర్వహించేందుకూ అప్పటి పాలకులు ఉత్సాహం చూపారు.
కోల్డ్ స్టోరేజీలు, కూల్ చాంబర్లు వంటి ఏర్పాటుచేసేందుకూ ప్రణాళికలు వేశారు. మరికొన్ని ప్లాంట్లు పెట్టేందుకు కూడా బ్యాంకుల రుణాలు తెచ్చుకొని మెటీరియల్‌ను కొనుగోలు చేశారు. కానీ అవేమీ ముందుకుపడకపోవడంతో ఆ మెటీరియల్ కూడా వృథా అయిపోయింది. అయితే, ఆ మెటీరియల్ కోసం ఇచ్చిన రుణాలను తిరిగి చెల్లించాలంటూ బ్యాంకులు కూడా ఖమ్మం డీసీఎంఎస్‌పై ఒత్తిడి తెచ్చాయి. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఆ బ్యాంకులకు హామీ ఇచ్చి గడువు కల్పించింది. దీంతో ఆ రుణాలను కూడా డీసీఎంఎస్ తీర్చివేసింది. ఇప్పుడు కూడా ప్రస్తుత ప్రభుత్వం డీసీఎంఎస్‌కు నిధులు కేటాయించి బలోపేతం చేయాల్సింది పోయి.. మొత్తానికే మట్టుబెట్టేందుకు ప్రణాళికలు రచిస్తుండడం గమనార్హం.
డీసీఎంఎస్ ఆధ్వర్యంలో విత్తనాలు, ఎరువుల విక్రయాలు కొన్నేళ్లుగా నిలిచిపోయాయి. గతంలో విత్తనాలు, యూరియాతోపాటు ఇతర కాంప్లెక్స్ ఎరువులను డీసీఎంఎస్ విక్రయించేది. తద్వారా ఆదాయం సమకూర్చుకునేది. కానీ రెండేళ్లుగా ప్రభుత్వం యూరియా, ఎరువుల రవాణా భారాన్ని డీసీఎంఎస్లపైనే వేయడంతో ఇవి ఆర్థికంగా కుంగిపోయింది. దీనితోపాటు ఎమ్మార్పీ ధరలకే ఎరువులు విక్రయించాలని నిబంధన ఉండడంతో ఆదాయం కోల్పోయింది. ఫలితంగా ఎరువుల విక్రయాలను, వ్యాపార లావాదేవీలను నిలిపివేసింది.
తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కారు.. ఎన్నికల సమయంలో రైతులికిచ్చిన హామీలను ఇప్పటికే గాలికొదిలేసింది. రైతుభరోసా, రుణమాఫీ వంటి అంశాల్లో ఘోరంగా విఫలమైంది. అయినప్పటికీ అద్భుతంగా చేశామంటూ అబద్ధాలు చెబుతోంది. ఈ క్రమంలో డీసీఎంఎస్లపైనా కన్నువేసినట్లు స్పష్టమవుతోంది. కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన ఈ రెండేళ్లలో డీసీఎంఎస్‌లకు బడ్జెట్టే కేటాయించలేదు. ఫలితంగా డీసీఎంఎస్‌ల ప్రగతి కుంటుపడింది. ఖమ్మం డీసీఎంఎస్ ఏర్పడినప్పుడు సుమారు 40 మంది ఉద్యోగులు ఉన్నారు.
ప్రస్తుతం ఏడుగురు మాత్రమే పనిచేస్తున్నారు. పదవీ విరమణ పొందిన వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టలేదు. ఖాళీల కొరత వెంటాడుతోంది. ఆదాయం లేకపోవటంతో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం తన వైఫల్యాన్ని డీసీఎంఎస్‌లపై చూపుతోంది. రైతులకు కనీస ప్రయోజనం అందించలేకపోతోందంటూ డీసీఎంఎస్‌లను రద్దు చేయడమే ప్రత్యామ్నాయమనే ఆలోచన చేస్తోంది. ఇందుకుకోసం ఖమ్మం డీసీఎంఎస్‌కు సంబంధించిన పూర్తి వివరాల నివేదికను జిల్లా అధికారుల నుంచి సేకరించింది. ఆ నివేదికలో ఉద్యోగులు, ఆస్తులు, అప్పులు, భవనాలు వంటి వివరాలను ఉన్నాయి.