కాలయాపనే కాంగ్రెస్ సర్కారు నైజమని, మాట తప్పడం ఆ పార్టీ మేనరిజమని జనం నోళ్లలో నానుతున్న సెటైర్లు వాస్తవ రూపంలోనూ నిజమనే రుజువవుతోంది. ఇది తమ విషయంలో నూరు శాతం యథార్థమేనని మినీ అంగన్వాడీలు స్పష్టం చేస్తున్నారు. తామే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమని చెబుతు న్నారు. అధికారంలోకి రాగానే.. మినీ నుంచి మెయిన్‌గా మారిన అంగన్వాడీ కేంద్రాల అప్‌గ్రేడేషన్ ఉత్తర్వులు జారీ చేస్తామన్న హామీ దగ్గర నుంచి మొదలుకొని ‘ఇదిగో.. పెంచిన వేతనాలు ఇస్తున్నాం..’ అనే ఆఖరి హామీ వరకూ.. ఇచ్చిన మాటలన్నీ నీటిమూటలేనని తేల్చిచెబు తున్నారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచుతున్నట్లు సాక్షాత్తూ సంబంధిత శాఖ మంత్రి సీతక్క పెట్టిన తొలి సంత కం కూడా ఆచరణలో అమలుకు నోచుకో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మోసకారి సర్కారుపై మర్లపడేందుకు మరెన్ని మోసాలు రుజువులుగా కావాలంటూ ప్రశ్నిస్తు న్నారు.. మినీ నుంచి మెయిన్‌గా అప్‌గ్రేడ్ అయిన భద్రాద్రి జిల్లా అంగన్వాడీ టీచర్లు.
-భద్రాద్రి కొత్తగూడెం, మే 21 (నమస్తే తెలంగాణ)
మినీ అంగన్వాడీల ప్రాధాన్యాన్ని గుర్తించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. వాటిని మరింత బలోపేతం చేసేందుకు అప్పట్లోనే కీలక నిర్ణయం తీసుకుంది. మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా, వాటిల్లో పనిచేసే మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా అప్‌గ్రేడ్ చేసింది. ఉత్తర్వులు జారీ చేసే ప్రక్రియ జరుగుతుండగానే అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. దీంతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. అయితే ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. కేవలం మినీలను మెయిన్లుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసి చేతులు దులుపుకుంది.
మెయిన్ అంగన్వాడీ టీచర్లతో సమానంగా మినీ అంగన్వాడీలకూ వేతనాలు పెంచుతూ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పెట్టిన తొలి సంతకం కూడా ఆచరణకు నోచుకోలేకపోయింది. దీంతో 12 నెలలుగా మినీ అంగన్వాడీ టీచర్లు హైదరాబాద్ చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయారు. పెంచిన వేతనాలు అందించాలని కోరుతూ మంత్రి సీతక్కకు, సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇచ్చీ ఇచ్చీ విసిగిపోయారు. ఈ ఏడాది కాలంగా సగం వేతనంతో సర్దుకొని కుటుంబాలను వెళ్లదీసుకుంటూ వచ్చారు. ఇదే సమయంలో తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ధర్నాలు, రాస్తారోకోల వంటి ఆందోళన కార్యక్రమాలూ నిర్వహించారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో మరోసారి రోడ్డెక్కేందుకు సిద్ధమవుతున్నారు.
మూడు నెలలే జమ చేసి మురిపించారు..
అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్న గొప్పను చెప్పుకోవడం కోసం కాంగ్రెస్ సర్కారు ఎత్తుగడలు కూడా వేసింది. అప్‌గ్రేడ్ చేసిన తొలినాళ్లలో అంటే నిరుటి జనవరి, ఫిబ్రవరి నెలలు, ఈ ఏడాది ఏప్రిల్ నెల మాత్రమే పెంచిన వేతనాలను ఖాతాల్లో జమ చేసింది. అయితే, ఈ ఏప్రిల్ నెల పెరిగిన వేతనాలు కూడా కేవలం 10 జిల్లాలకే జమ చేసినట్లు మినీ అంగన్వాడీలు చెబుతున్నారు. ఇంకా 23 జిల్లాలకు జమ చేయలేదని, అందులో భద్రాద్రి జిల్లాకు కూడా జమ చేయలేదని చెబుతున్నారు. అయితే, వెనుకాముందుగా ఈ ఏప్రిల్ నెల వేతనం జమ చేసిన పక్షంలో మరి గత 12 నెలల వేతనం మాటేమిటని మినీ అంగన్వాడీలు ప్రశ్నిస్తున్నారు. తమ ఏడాది రెక్కల కష్టం బూడిదలో పోసినట్లేనా అనే సందేహాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
‘భద్రాద్రి’లో 626 మంది ‘మినీ’లు
ఈ అప్‌గ్రేడేషన్‌లో భద్రాద్రి జిల్లాలోని 626 మంది మినీ అంగన్వాడీ టీచర్లకు లబ్ధి చేకూరలేదు. మినీ టీచర్లకు రూ.7,500, మెయిన్ టీచర్లకు రూ.13,500 చొప్పున వేతనాలు చెల్లించేవారు. 12 నెలల క్రితం మినీలను మెయిన్లుగా అప్‌గ్రేడ్ చేయడంతో వారికి అప్పటి నుంచే రూ.13,500 చొప్పున వేతనాలు అందించాల్సి ఉంది. పేరుకు వీరు మెయిన్ టీచర్లుగా అప్‌గ్రేడ్ అయినప్పటికీ.. వేతనం రూ.7,500 చొప్పునే పొందుతున్నారు. కానీ.. హెల్పర్లు కూడా లేకపోవడంతో ఇటు ఆయాలుగానూ, అటు టీచర్లుగానూ విధులు నిర్వహించాల్సి వస్తోంది. పైగా ప్రభుత్వం అప్పగించే వివిధ సర్వేలు సహా ఇంకొన్ని అదనపు పనులనూ భుజాన వేసుకోవాల్సి వస్తోంది.
అప్‌గ్రేడ్ చేశారు.. వేతనాలు ఇవ్వడం లేదు..
మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా ఎప్పుడో అప్‌గ్రేడ్ చేశారు. తరువాత మూడంటే మూడు నెలలు మాత్రమే మెయిన్ టీచర్లతో సమానమైన రూ.13,500 వేతనం ఇచ్చారు. మళ్లీ గడిచిన 12 నెలలుగా మినీలకు ఇచ్చే రూ.7,500 వేతనాన్నే ఇస్తున్నారు. ఈ ఏప్రిల్ నెల నుంచి కొత్త జీతం వస్తుందని అన్నారు.
-పరిసిక వెంకటరమణ, భద్రాచలం
అనేక కష్టాలు పడుతున్నాం..
హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మా మినీ అంగన్వాడీలకు ఎంతో మేలు చేస్తుందని అనుకున్నాం. చిన్నచూపు, అదనపు భారాలు తప్ప ఏమీ లేదు. మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా ఉన్నతీకరించి ఏడాది అవుతోంది. ఇంత వరకూ అందుకు తగ్గ వేతనాలే ఇవ్వడంలేదు.
-చంద్రకళ, మణుగూరు
ఏప్రిల్ నుంచి కొత్త జీతాలు వస్తున్నాయి..
గత నెల నుంచి పెంచిన వేతనం వస్తోందని తెలిసింది. గతంలో ఫైనాన్షియల్ అప్రూవల్ కాకపోవడం వల్ల ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు ఆ సమస్య తొలగిపోయింది. కొన్ని జిల్లాల్లో ఏప్రిల్ నెల నుంచి పెరిగిన వేతనాలు జమ అవుతున్నాయి. భద్రాద్రి జిల్లాలో కూడా జమ అవుతాయి. పెండింగ్ వేతనాల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
-స్వర్ణలత లెనీనా, జిల్లా సంక్షేమాధికారి