నాలుగు పథకాల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి కూడా నాటకం ఆడినట్లుగానే కన్పిస్తోంది. పథకాల అమలు పేరుతో మాటలు మారుస్తూ, గడువులు పెంచుతూ వచ్చిన రేవంత్ సర్కారు.. ఎట్టకేలకు ఈ నెల 26న నాలుగు పథకాల ఫలాలను లబ్ధిదారుల చెంతకు చేరుస్తున్నట్లు ఎంతో ఆర్భాటంగా ప్రకటించింది. అదే రోజున పైలట్ గ్రామాల్లో సభలు పెట్టింది. ఎంపిక చేసిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు కూడా అందజేసింది. కానీ వాటికి సంబంధించిన నగదు మాత్రం కొందరికే జమ చేసింది. దీంతో ఓవైపు పైలట్ గ్రామాల కింద ఎంపిక కాని లక్షలాది మంది ప్రజల ఆశలపై ఆదిలోనే నీళ్లు చల్లింది. మరోవైపు పైలట్ గ్రామాల్లోని లబ్ధిదారుల్లోనూ సింహభాగం మందికి పంగనామాలు పెట్టింది. దీంతో 26న గానీ, ఆ తరువాత గానీ ప్రభుత్వం చెప్పినట్లుగా పథకాల పైకాలు జమ కాని పేదలందరూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పైగా పథకాలన్నింటికీ అనర్హులను ఎంపిక చేశారంటూ గ్రామసభల్లో గగ్గోలు పెట్టినా వారికే పథకాల పైకాలను జమ చేయడంతో అర్హులందరూ రగిలిపోతున్నారు. – ఖమ్మం, జనవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
‘హనుమంతుడి పెళ్లి ఎప్పుడు?’ అంటే ‘రేపే?’ అనే మాదిరిగా.. పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పథకాల అమలు గడువును పొడిగించుతూ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతుభరోసా, ఆత్మీయ భరోసా వంటి పథకాలను తమ అధినేత్రి సోనియాగాంధీ పుట్టిన రోజైన, తమ ప్రభుత్వం కొలువుదీరిన డిసెంబర్ 9 నుంచి అమలు చేస్తామంటూ ఆరు నెలల క్రితమే ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తరువాత ఆ గడువును సంక్రాంతికి పొడిగించింది. ఆ తరువాత దానిని గణతంత్ర దినోత్సవమైన జనవరి 26కు మార్చింది. ఆ తరువాత అర డజను కారణాలు చెబుతూ మార్చి 31 వరకూ మార్చివేసింది.
చివరికి మరో మోసానికి తెర తీస్తూ.. జనవరి 26న ఇంకో ప్రకటన చేసింది. మండలానికి ఒక పైలట్ గ్రామాన్ని ఎంపిక చేస్తామని, 26న ఆ గ్రామంలోని నాలుగు పథకాల లబ్ధిదారులకు పథకాల ఫలాలను అందజేస్తామని వెల్లడించింది. అర్హుల అభ్యంతరాల మధ్య అనర్హుల పేర్లతో కూడిన జాబితాలనే ఆమోదించింది. వాటిల్లోని అనర్హులకు, అర్హులకే ఆ రోజున మంజూరు పత్రాలు అందించింది. రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాల లబ్ధిదారులకు (అందులో సింహభాగం అనర్హులే) జనవరి 27న రూ.6 వేల చొప్పున జమ చేసింది. కానీ అందులో చాలామంది నిజమైన లబ్ధిదారులకు పథకాల పైకాలు జమ కాలేదు. ‘నమస్తే తెలంగాణ’ క్షేత్రస్థాయి పరిశీలనలో ఇదే విషయం తేటతెల్లమైంది. తమకు అర్హత ఉన్నప్పటికీ, జాబితాలో తమ పేరు ఉన్నప్పటికీ రైతు భరోసా, ఆత్మీయ భరోసా నగదు జమ కాలేదని అనేకమంది పేదలు, లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తాము నిరుపేదలమైనా తమకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు మంజూరు చేయలేదని వాపోయారు.
మచ్చుకు కొన్ని ఉదాహరణలు..
తిరుమలాయపాలెం మండలంలో 18,165 కుటుంబాలకు జాతీయ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు ఉన్నాయి. వీరిలో అసలు భూమిలేని కుటుంబాలు సుమారు పది వేలు. కనీసం 20 రోజులు పని చేసి ఉండాలన్న నిబంధన పెట్టిన ప్రభుత్వం.. మండలంలోని 40 గ్రామ పంచాయతీల్లో కలిపి కేవలం 1,767 కుటుంబాలనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఎంపిక చేసింది. ఇదే మండలంలోని పైలట్ గ్రామమైన ఏలువారిగూడేన్ని పరిశీలిస్తే మరింత స్పష్టత వస్తుంది. గ్రామంలో 55 మందిని ఇందిరమ్మ ఇళ్లకు అర్హులుగా గుర్తించారు. కానీ కేవలం 13 మందికే మంజూరు పత్రాలు అందజేశారు. రేషన్ కార్డులకు 35 మందిని గుర్తించారు. కేవలం 18 మందికే మంజూరు పత్రాలు అందించారు.
ఆ రేషన్ కార్డుల పత్రాలనూ తప్పుల తడకగా ముద్రించారు. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి 46 కుటుంబాల వారిని అర్హులుగా గుర్తించారు. కానీ సవాలక్ష కొర్రీలతో 22 మందికి మాత్రమే పథకాన్ని వర్తింపజేశారు. రైతు భరోసాకు 202 మందిని ఎంపిక చేశారు. కానీ ఇంకా కొద్దిమంది ఖాతాల్లో జమ చేయలేదు. అన్నపురెడ్డిపల్లి మండలం ఊటుపల్లి రెవెన్యూలో మొత్తం 440 మంది రైతులు రైతు భరోసాకు అర్హులు. సుమారు 1,399 ఎకరాలను వీరు సాగుచేస్తున్నారు. వీరికి రూ.83.98 లక్షలు జమ కావాల్సి ఉంది. కానీ నూతనంగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన సుమారు 39 మంది రైతులకు తాజాగా రైతు భరోసా జమ కాలేదు. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి పాస్‌బుక్‌లు మంజూరైన రైతులకు కూడా రైతు భరోసాను వర్తింపజేస్తామని చెప్పిన ప్రభుత్వం.. నాలుగు నెలల క్రితం పట్టాబుక్లు మంజూరైన రైతులకు కూడా రైతు భరోసాను జమ చేయలేదు. తాజాగా పట్టాబుక్లు మంజూరు చేసిన 39 మంది రైతుల్లో కేవలం 12 మందికి మాత్రమే పంటల పెట్టుబడి సాయాన్ని అందించడం గమనార్హం.
అనర్హులకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు..
మా ఊరిని పైలట్ గ్రామంగా ఎంపిక చేశారు. కానీ ఇందిరమ్మ ఇళ్లను మాత్రం అనర్హులకే మంజూరు చేశారు. ఏకంగా వారికి మంజూరు పత్రాలను కూడా అందజేశారు. మా గ్రామంలో అర్హులు చాలామంది ఉన్నప్పటికీ వారిలో అత్యధికులకు ఇందిరమ్మ ఇళ్లు రాలేదు. ఉండేందుకు నాకు ఇల్లు కూడా లేదు. సాగుచేసుకునేందుకు సెంటు భూమి కూడా లేదు. హోటల్లో పనిచేసుకొని బతుకుతున్నా. అయినా ప్రభుత్వం నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదు. నేను గట్టిగా అడిగినందుకు పంచాయతీ కార్యదర్శి నాపై కక్ష గట్టి నాకు ఇల్లు రాకుండా చేశారు. మా గ్రామంలో మళ్లీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సర్వే చేసి అర్హులకు మాత్రమే పథకాలు వర్తింపజేయాలి.
-నిట్టా శిరీష, భూపాలపట్నం, పినపాక
నాకు రైతు భరోసా రాలేదు..
అన్నపురెడ్డిపల్లి మండలం ఊటుపల్లి రెవెన్యూలోని సర్వే నెంబర్ 101లో నాకు మూడు ఎకరాల సాగు భూమి ఉంది. నాలుగు నెలలు క్రితం మా నాన్న పేరు నుంచి నా పేరు మీదికి మూడు ఎకరాలను వారసత్వ బదిలీ చేసుకున్నాం. నాకు పట్టాదారు పాసుపుస్తకం కూడా వచ్చింది. అధికారులు చెప్పిన వెంటనే రైతుభరోసా కోసం నేను ఇప్పటికే దరఖాస్తు చేసుకొని ఉన్నాను. కానీ పైలట్ ప్రాజెక్టుగా ఉన్న మా గ్రామంలో నాకు రైతుభరోసా రాలేదు. ఈ ఏడాది జనవరి 1 నాటికి నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులందరికీ రైతుభరోసా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ నాలుగు నెలల క్రితం పట్టా పొందిన నాకు మాత్రం రైతుభరోసాను ఇవ్వలేదు.
-మామిళ్లపల్లి సాహిత్య, ఊటుపల్లి, అన్నపురెడ్డిపల్లి
అనర్హులకే పథకాలు..
నిరుపేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. అర్హులెవరికీ ఇవ్వలేదు. పైగా అనర్హులకే ఇచ్చింది. నాలుగు పథకాల్లోనూ (ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రైతుభరోసా, రేషన్‌కార్డులు) అలాగే చేసింది. నాకు తడికల ఇల్లు మాత్రమే ఉంది. సర్వే సమయంలో అధికారులు వచ్చారు. ఇంటిని చూశారు. రాసుకొని వెళ్లారు. కానీ మొన్నటి ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాలో నా పేరు లేదు. ఇప్పటికే రెండుసార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ నాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు. పైగా మాది పైలట్ గ్రామంగా ఎంపికైన సోంపల్లి. మా ఊరిలోనే అర్హులకు పథకాలు అందకపోతే ఎలా? ఉపాధి పనులకు కూడా నేను క్రమం తప్పకుండా వెళ్తుంటాను. ఆత్మీయ భరోసా పథకానికి నేను అర్హురాలినైనప్పటికీ ఆ జాబితాలో నా పేరు రాలేదు. ప్రభుత్వం అనర్హులకే అన్నీ ఇస్తోందని అర్థమవుతోంది.
-బోరెం అంజమ్మ, సోంపల్లి, బూర్గంపహాడ్ మండలం
ఈ రోజు వరకు అకౌంట్లో డబ్బులు పడలేదు..
నా పేరు రాధిక. నా పేరుతో రెండెకరాల సాగు భూమి ఉన్నది. నా భర్త పేరు నాగేశ్వరరావు. ఆయన పేరుతో కూడా మూడు ఎకరాల సాగు భూమి ఉన్నది. మేమిద్దరూ రైతుభరోసా పథకానికి ఎంపికైనట్లు చెప్పారు. ఈ నెల 26న రైతుభరోసా కింద ఎకరానికి రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం జమ అవుతుందని చెప్పారు. కానీ మాకు ఇంత వరకూ డబ్బులు పడలేదు. డబ్బులు జమ అయినట్లు మా సెల్ఫోన్లకు మెసేజీలు కూడా రాలేదు. మా మామయ్యకు ఎకరం, మా అత్తయ్యకు అత్తయ్యకు అరెకరం చొప్పున పంట భూమి ఉంది. కానీ వారికి కూడా రైతుభరోసా నిధులు జమ కాలేదు. మా ఊరిలో ఎవరిని అడిగినా పడలేదనే అంటున్నారు. రెండు, మూడు రోజులు చూసి రైతువేదిక దగ్గరకు వెళ్లి వ్యవసాయ అధికారులను అడుగుతాం.
-పోతగాని రాధిక, నాగేశ్వరరావు దంపతులు, రైతుభరోసా లబ్ధిదారులు, వేపకుంట్ల
26నే రైతుభరోసా పడుతుందని సీఎం చెప్పినా పడలేదు..
మాది చండ్రుగొండ మండలంలోని బెండాలపాడు గ్రామం. మా ఊరిని రాష్ట్ర ప్రభుత్వం పైలట్ గ్రామంగా ఎంపికచేసింది. మా గ్రామంలో నాకు ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కానీ ఇప్పటి వరకు నాకు రైతుభరోసా పంటల పెట్టుబడి సాయం డబ్బులు అందలేదు. ఈ నెల 26నే జమ చేస్తామని సాక్షాత్తూ సీఎం సారే చెప్పారు కానీ ఇప్పటి వరకూ నా అకౌంట్లో రైతుభరోసా నగదు జమ కాలేదు. పంటల పెట్టుబడి కోసం ఇప్పటికే ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్నాం. రేపుమాటు అంటున్నారే తప్ప ఇంకా ఇవ్వడం లేదు. 26న ఇస్తామని చెప్పారు. అయినా ఇవ్వలేదు. కేసీఆర్ సారు ఉన్నప్పుడు ఠంచనుగా రైతుబంధు వచ్చేది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వచ్చింది. మాలాంటి రైతులకు బాధలు మొదలయ్యాయి.
-బోడా రవి, రైతు, బాలికుంట, బెండాలపాడు, చండ్రుగొండ
మంజూరు పత్రమిచ్చారు.. డబ్బులు జమకాలేదు..
నాకు సాగుభూమి లేదు. క్రమం తప్పకుండా ఉపాధి హామీ పనికి వెళ్తుంటా. దీంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అధికారులు నన్ను ఎంపిక చేశారు. ఈ నెల 26న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ ఖాన్ వచ్చి మా ఊరిలో మీటింగ్ పెట్టారు. ఆత్మీయ భరోసా పథకానికి నేను ఎంపికయ్యానని చెప్పారు. మంజూరు పత్రాన్ని కూడా నాకు అందజేశారు. తెల్లారితే నా బ్యాంకు అకౌంట్లో రూ.6 వేల డబ్బులు జమ అవుతాయని చెప్పారు. కానీ ఈ రోజు వరకు జమ కాలేదు. మా ఊరి మాజీ ప్రజాప్రతినిధులను అడిగాము. పడతాయిలే అని అంటున్నారు. కానీ ఎప్పుడు పడతయో ఏమో! ఈ నెలాఖరు వరకు ఎదురుచూస్తాను.
-బండి సుగుణ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారురాలు, వేపకుంట్ల