సహకార సంఘాల ఎన్నికలపై అటు అధికారులు, ఇటు అధికార పార్టీ నేతల్లోనూ సందిగ్ధత నెలకొంది. ఈ నెల 13తో పాలకవర్గాల గడువు ముగియనున్నప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎన్నికల నిర్వహణపై ఎటువంటి స్పష్టత లేదు. దీంతో రేవంత్‌రెడ్డి సర్కార్ సహకార సంఘాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తుందా? లేక ఉన్న పాలకవర్గాల పదవీకాలం పొడిగిస్తుందా? అనే మీమాంస నెలకొంది. అయితే రైతు సంక్షేమ పథకాలు అమలులో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం సహకార ఎన్నికలకు వెళ్లేందుకు భయపడుతుందన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతున్నది. రుణమాఫీ నుంచి రైతుభరోసా వరకు అడుగడుగునా కొర్రీలు పెట్టుకుంటూ కాలయాపన చేస్తున్నది.
ఎరువుల కొరత అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తున్నది. వేసవి సమీపిస్తున్న దశలో కరెంట్ కోతలపైనా రైతులు ఆందోళనగా ఉన్నారు. ఫలితంగా అన్నివర్గాల రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్‌రెడ్డి క్యాబినెట్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇది గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లకుండా నామినేట్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత లేకపోవడంతో జిల్లా ఉన్నతాధికారులు సైతం అయోమయంతో తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు ఆశావాహులు మరింత ఉత్కంఠకు గురవుతున్నారు.
– అశ్వారావుపేట, ఫిబ్రవరి 9
సహకార సంఘాల ఎన్నికలపై నీలినీడలు కప్పుకున్నాయి. పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 13తో ముగుస్తున్నది. కొత్త పాలకవర్గాల ఎంపికపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పాలకవర్గాల స్థానంలో ప్రత్యేకాధికారులను నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆరునెలలు ముందుగానే ఎన్నికల ప్రక్రియ మొదలుకావాల్సి ఉండగా కేవలం 3 రోజుల గడువు ముగుస్తున్నా ఆ ఊసేలేదు. ఎటువంటి ముందస్తు కసరత్తు లేకపోవడం గమనార్హం. దీనిపై రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. 2020 ఫిబ్రవరి 13న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సహకార సంఘాలకు కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. తర్వాత రోజు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్, జిల్లా మార్కెటింగ్ సొసైటీల పాలకవర్గాల సభ్యులు ఎన్నికయ్యారు. వీటి పదవీ కాలం కూడా 14తో ముగుస్తుంది.
జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 21 సహకార సంఘాలు ఉన్నాయి. వీటి సంఖ్యను పెంచేందుకు పాలకవర్గాల నుంచి జిల్లా అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. మరో 35 కొత్త సంఘాల ఏర్పాటుకు దరఖాస్తులు అందాయి. ప్రభుత్వం వీటిని అమోదిస్తే మొత్తం సంఖ్య 56 సంఘాలకు చేరుతుంది. కొత్త జిల్లాస్థాయిలో సహకార బ్యాంక్ విస్తరణ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోనే జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఉంది. కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు ఆయా జిల్లాలో స్థాయిలో సహకార బ్యాంకులను విస్తరించాలని ప్రభుత్వం సూచించింది. రైతులు దీర్ఘకాలిక, పారిశ్రామిక రుణాల కోసం ఉమ్మడి జిల్లా కేంద్రమైన ఖమ్మం వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలో రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
రైతు సంక్షేమంలో తీవ్ర వ్యతిరేతకను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు భయపడుతున్నట్లు రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలో ఎన్నికలకు వెళ్తే రైతుల నుంచి ఛీదరింపులు తప్పవనే భావనలో రేవంత్‌రెడ్డి సర్కార్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే నామినేట్ పద్ధతిలో పాలకవర్గాలను నియమించాలనే ఆలోచనలోనూ ఉన్నట్లు తెలుస్తోంది. అలా కాకుంటే పర్సన్ ఇన్చార్జ్ బాధ్యతలు కూడా ఇవ్వొచ్చనే వాదన బలంగా వినిపిస్తున్నది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో జిల్లా ఉన్నతాధికారులు, రాజకీయ పార్టీల నేతలు, ఆశావాహులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.
సహకార సంఘాల ఎన్నికలపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై తదుపరి చర్యలు తీసుకుంటాము. ఎన్నికలా.. లేదా పదవీకాలం పొడిగింపా అన్న నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాలి. ఇప్పుడు ఉన్న పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 13తో ముగుస్తుంది. జిల్లాలో మొత్తం 21 సంఘాలు ఉన్నాయి. కొత్త సంఘాల కోసం 35 దరఖాస్తులు అందాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటాం.
– ఖుర్షీద్, జిల్లా సహకార అధికారి, కొత్తగూడెం